టెస్టుల్లో కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా మార్చొద్దని టీమ్‌ఇండియా మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో వికెట్ కీపర్లను మార్చడం సరికాదన్నాడు. ఇటీవల టీమ్‌ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో రాహుల్ అనివార్య పరిస్థితుల్లో కీపింగ్ చేయాల్సి వచ్చింది. సహజంగా టాపార్డర్ బ్యాట్స్‌మన్ అయిన అతడు ఆ పర్యటనలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడమే కాకుండా కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. దీంతో రెండు పాత్రల్లోనూ మంచి ప్రదర్శన చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని టెస్టుల్లో కూడా కీపర్‌గా మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానికి స్పందించిన చోప్రా అది సరైన నిర్ణయం కాదని చెప్పాడు.
"క్రికెట్‌లో ఏమైనా చేయొచ్చు కానీ, టెస్టుల్లో కీపర్లకు షిఫ్టింగ్ పద్ధతి ఉండకూడదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో వికెట్ కీపింగ్ అనేది ప్రత్యేక బాధ్యత. అక్కడ 100 ఓవర్ల పాటు కీపింగ్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే ఈ విషయంపై మాజీ బౌలర్ సందీప్‌శర్మ అభిప్రాయం అడగండి. 1990లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అతడి బౌలింగ్‌లోనే కిరణ్ మోరే.. గ్రాహంగూచ్ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడు 333 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో కీపర్లు క్యాచ్‌లు వదిలేసినా, స్టంపింగ్ చేయడాలు వదిలేసినా అవి భారీ మూల్యానికి దారితీస్తాయి. కాబట్టి, టెస్టుల్లో కీపర్లను మార్చకూడదు."
-ఆకాశ్‌చోప్రా, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
అలాగే రాహుల్ వైవిధ్యమైన ఆటగాడని, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడని మెచ్చుకున్నాడు. అయితే, అతడికి టెస్టుల్లో ఆడే అవకాశం లేదన్నాడు. స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గానైనా ఆడించడం కష్టమన్నాడు. టాప్, మిడిలార్డర్లలో ఇప్పటికే సరిపడా బ్యాట్స్‌మన్ ఉన్నారని, ఇక కీపింగ్ విభాగంలోనూ వృద్ధిమాన్ సాహాను తప్పించడానికి కారణాలు లేవన్నాడు. ఇప్పటికైతే రాహుల్ టెస్టుల్లో ఆడాలంటే వేచిచూడాలని తెలిపాడు.