ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన లసిత్ మలింగను అభినందించాడు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా. మలింగ లేని ఐపీఎల్ ఇకపై మునుపటిలా ఉండదని అభిప్రాయపడ్డాడు. అతడితో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. మలింగ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పాడు బుమ్రా.
"కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్ జట్టులో మీతో కలిసి బౌలింగ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికినందుకు అభినందనలు. మీరు లేకుండా ఐపీఎల్ మునుపటిలా ఉండదు," అని బుమ్రా ట్వీట్ చేశాడు.
ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి మలింగ తప్పుకోవాలనుకున్నాడు. అందుకే ఐపీఎల్-2021 కోసం జట్టులో అతనికి స్థానం కల్పించడంలేదని ముంబయి ఇండియన్స్ వెల్లడించింది.
ఇదీ చదవండి: 'టీమ్ఇండియాకు క్వారంటైన్ తప్పనిసరి కాదు'