ఐపీఎల్లో గాయపడ్డ టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణా శిబిరానికి వెళ్లాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడా? ప్రస్తుతం అతడి ఫిట్‌నెస్ పరిస్థితి ఎలా ఉంది? ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడతాడా? అసలు గాయమైనప్పుడు ఐపీఎల్లో చివరి రెండు మ్యాచ్‌లుతో పాటు ఫైనల్ ఎలా ఆడగలిగాడు? మరి అప్పుడు ఆడగలిగిన వాడిని బీసీసీఐ ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎందుకు పక్కన పెట్టింది? లాంటి పలు ప్రశ్నలు అభిమానులు నుంచి పలు మాజీ, సహ క్రికెటర్ల మదిలో ప్రశ్నలు మెదులుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఓ నిర్ణయానికి వచ్చేసి పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్.. వీటన్నింటికి సమాధానమిచ్చాడు.
"అసలేం జరుగుతుందనే విషయంపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. అయితే, నేనొక విషయం చెప్పదల్చుకున్నాను. నేను నిరంతరం బీసీసీఐ, ముంబయి ఇండియన్స్‌తో చర్చలు జరుపుతున్నాను. లీగ్ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెడతానని మా జట్టుకు చెప్పాను. ఆ విషయంలో స్పష్టత వచ్చాక పరుగులు చేయడంపై దృష్టి సారించాను. ఇప్పుడు తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నాను. ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్ సాధిస్తున్నాను. అలాగే టెస్టు సిరీస్ ఆడకముందే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే నమ్మకం కలగాలి. ఎందుకంటే ఏ విషయంలోనూ నన్ను వేలెత్తి చూపొద్దని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేం అనుకున్నా పట్టించుకోను. ఇప్పుడు 25 రోజుల పాటు పూర్తిస్థాయిలో కోలుకుని టెస్టు సిరీస్‌కు సిద్ధమవ్వాలని అనుకుంటున్నాను. అయితే, నా విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు"
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా క్రికెటర్
ముంబయి ఇండియన్స్ రాత్రికి రాత్రే విజయవంతం కాలేదని రోహిత్ శర్మ చెప్పాడు. జట్టు యాజమాన్యం తమను నమ్మిందని, దాంతో ఒక బలమైన బృందాన్ని నిర్మించామని అన్నాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌల్ట్‌ను ప్రశంసించాడు. అతడి ఎంపిక పట్ల తాను గర్వంగా ఉన్నట్లు తెలిపాడు. సూర్యకుమార్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయనప్పుడు అతడే వచ్చి తనతో మాట్లాడాడని గుర్తుచేసుకున్నాడు. ఆ విషయాన్ని వదిలేసి ముంబయికు మ్యాచ్‌లు గెలిపిస్తానని తనతో అన్నట్లు చెప్పాడు. దాంతో సూర్య సరైన మార్గంలో పయనిస్తున్నాడని అనిపించిందని అన్నాడు. ఎప్పటికైనా అతడు భారత జట్టులో ఆడతాడనే నమ్మకం ఉందన్నాడు.
ఇదీ చూడండి : ఎన్‌సీఏలో రోహిత్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ షురూ!