టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పనిచేసేందుకు దిగ్గజ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవిపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనిల్ కుంబ్లేను ఆ పదవికి సరైన వ్యక్తిగా పోల్చాడు. అతడి వ్యాఖ్యలను సమర్థించాడు దాదా. సెలక్టర్ పదవి కుంబ్లేను వరిస్తే నిజంగా సంతోషిస్తానని అన్నాడు. అయితే కోచ్ పదవిపై తనకు ఇష్టమున్నట్లు పరోక్షంగా వెల్లడించాడు.
"అనిల్ కుంబ్లే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయితే అంతకంటే మంచిది ఏముంటుంది. అతడు నిజాయతీగా పనిచేస్తాడు. భారత క్రికెట్‌కు అతడో కీలక ఆటగాడు. సెహ్వాగ్ మంచి సెలక్టర్ కాగలడు. అతడికి ముందుచూపు, ధైర్యం ఉన్నాయి. క్రికెట్‌లో అతడు సేవలందించాడు. విశ్లేషణ, దూరదృష్టి కలిగిన వీరూ... తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించగలడు. అనిల్ కుంబ్లే, సెహ్వాగ్ ఇద్దరూ కలిసి సెలక్టర్లుగా పనిచేయవచ్చేమో". -సౌరవ్ గంగూలీ, భారత జట్టు మాజీ కెప్టెన్
క్రికెట్‌లో సెలక్టర్ పదవి కీలకంగా మారిందని అభిప్రాయపడ్డాడు గంగూలీ. ఎందుకంటే జట్టుకు ఏ కోచ్‌ను ఎంపికచేయాలో వారి చేతుల్లోనే ఉంటుంది. శిక్షకులు.. సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తారని... కానీ తుది నిర్ణయం సెలక్టర్ల చేతిలోనే ఉంటుందని చెప్పాడు. టీమిండియా కోచ్ పదవిపై తనకూ ఏదో ఒకరోజు ఆసక్తి ఏర్పడవచ్చని అన్నాడు. కోహ్లీతో కలిసి పనిచేయడాన్ని గొప్పగా భావిస్తానని... ఎందుకంటే అతడో ఛాంపియన్ క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు.
ఇది చదవండి: విరాట్ ఏం పుస్తకం చదువుతున్నాడో తెలుసా..!