మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆటతోనే కాక మైదానంలో అనుసరించే వ్యూహాలతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ధోని వయసు 37 ఏళ్లు. ఈ వయసులోనూ వికెట్లు వెనక చురుగ్గా కదులుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ప్రపంచకప్ అతనికి చివరదా...? కప్పు గెలిచి అతనికి టీమిండియా ఘన వీడ్కోలు పలుకుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు క్రికెట్ అభిమానుల మనసుల్ని తొలిచేస్తున్నాయి.
2014లో టెస్టులకు వీడ్కోలు పలికాడు ధోని. అప్పటి నుంచి వన్డే, టీ-ట్వంటీల్లో కొన్నిసార్లు మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేశాడు. ఆ మధ్య కాలంలో మాజీల నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నాడు. కొన్ని సార్లు బ్యాట్‌తో వారికి సరైన సమాధానమే చెప్పినా... ఆ ప్రదర్శన జట్టుకు విజయాలనందించలేదు. మళ్లీ ఇటీవలి ఫామ్‌తో... ఒకప్పటి ఫినిషర్‌ని గుర్తుకుతెచ్చే ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
3 మేజర్ టోర్నీ టైటిళ్ల రికార్డు ధోనీదే....
2007లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అదే సంవత్సరం టీ-ట్వంటీ ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మేజర్ టోర్నీల్ని జట్టుకు అందించాడు. మరే కెప్టెన్లకూ సాధ్యం కాని ఘనతల్ని సొంతం చేసుకున్నాడు.
2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి... మూడు మేజర్ టోర్నీలు నెగ్గిన మొదటి భారత సారథిగా రికార్డు సృష్టించాడు. టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ను మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత ధోనికే దక్కుతుంది.
వ్యూహాల్లో కోహ్లీకి వెన్నుదన్నుగా....
కోహ్లీ నేతృత్వంలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది. ఈ విజయాల్లో ధోని పాత్ర వెలకట్టలేనిది. వికెట్ల వెనకుండి స్టంపింగ్లోనూ, సమీక్షల్ని సరిగ్గా ఉపయోగించడంలోనూ జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాడు.
ఇటీవల ఆసీస్‌తో సిరీస్‌లో మంచి ప్రదర్శనలు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అందరూ విఫలమవుతున్నా కొన్ని మ్యాచుల్లో కీలక సమయాల్లో రాణించి జట్టుకు అండగా నిలుస్తున్నాడు.
ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రపంచకప్‌లో ధోని సలహాలు, సూచనలు భారత జట్టుకు ఎంతో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.
కోహ్లీ నాయకత్వంలో జట్టు అన్ని ఫార్మాట్లలోనూ రాణిస్తూ... ప్రపంచకప్‌కు వాయువేగంతో సిద్ధమవుతోంది. మరి ధోని సహాకారంతో ప్రపంచకప్‌లో విజయ ఢంకా మోగించి కప్పు కొడతామా... లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.