డిసెంబరులో టీమ్‌ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై నోరు జారనని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు వార్నర్. మరోవైపు ఈ ఏడాది చివర్లో భారత పర్యటన గురించి కూడా స్పందించాడు.
"విరాట్ కోహ్లీని కవ్వించొద్దు. అతడు అలాంటి ఆటగాడు కాదు. ఎలుగుబంటిని రెచ్చగొట్టడంలో అర్థమే లేదు. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో అతడిని స్లెడ్జింగ్ చేయను. 2018-19లో జరిగిన సిరీస్‌లో భారత్ చక్కటి ప్రదర్శన చేసింది. ఆ జట్టు బౌలర్లు చెలరేగడం వల్ల మా జట్టు ఓడిపోయింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భారత బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం పటిష్టంగా ఉంది. వారిని టార్గెట్ చేసేందుకు మా బౌలర్లూ సిద్ధంగా ఉన్నారు. అయితే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశం ఉంది. అయితే భారత్‌తో ఆడేప్పుడు ప్రేక్షకులు లేకపోతే బాగోదు".
-డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా ఓపెనర్
ఐపీఎల్ విషయంపైనా స్పందించిన వార్నర్.. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదా పడి, అదే సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. తమ బోర్డు అనుమతిస్తే వేలంలో ఎంపికైన వారంతా ఐపీఎల్ ఆడతారన్నాడు. అయితే దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరని గుర్తుచేశాడు.
2018-2019 సీజన్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా చారిత్రక టెస్టు సిరీస్ గెలుపొందింది. బాల్ టాంపరింగ్ వ్యవహారంతో ఆ సమయంలో వార్నర్ నిషేధ కాలంలో ఉన్నాడు. ఇక అంతకుముందు ఆడిన సిరీస్‌లో రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీలతో దురుసుగా ప్రవర్తించి నోరు పారేసుకున్నాడు. అయితే బాల్ టాంపరింగ్ పరిణామాల అనంతరం అతడి ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.