ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన సురేశ్ రైనా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చేయనున్నాడని చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం శనివారం ప్రకటించింది. ప్రస్తుత సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని వెల్లడించింది. అప్పటినుంచి అసలు కారణం ఏమై ఉంటుందా? అని క్రికెట్ అభిమానులు అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
ఏం జరిగింది?
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ పఠాన్‌కోట్‌లో ఉంటున్న అశోక్ కుమార్ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 19 రాత్రి తన డాబాపై నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన ఇంటిపై దాడి చేసి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలోనే అశోక్ తలకు తీవ్రగాయమై, ఆ రాత్రే మరణించారు. మిగిలిన కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. వీరిలో అశోక్ సతీమణి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.
భారత క్రికెటర్ రైనాకు అశోక్ కుమార్‌తో బంధుత్వం ఉందని, త్వరలో ఆయన కుటుంబాన్ని చూసేందుకు వస్తారని ఆయన సోదరుడు శ్యామ్ లాల్ చెప్పారు. అయితే రైనా, అశోక్ బంధువులు అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.