Asia Games 2023 Cricket : ఆసియా గేమ్స్‌కు భారత జట్లను పంపించే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. చైనా ఆతిథ్యం ఇస్తున్న ఆసియన్ గేమ్స్ 2023కు భారత పురుషులు, మహిళల జట్లను పంపించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురించింది. అయితే ఇంతకుముందు ఆసియా గేమ్స్‌కు తమ జట్లను పంపించబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. క్రికెట్‌ను ఇప్పటివరకు ఆసియన్ గేమ్స్‌లో 2010, 2014లో మాత్రమే భాగం చేశారు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది. ఈ ఆసియా క్రీడల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, శ్రీలంక లాంటి టీమ్‌లు పాల్గొన్నప్పటికీ.. భారత్ మాత్రం తమ జట్లను పంపించలేదు.
ICC World Cup 2023 : ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు, చైనాలోని హాంగ్‌జౌ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యమిస్తోంది. దీంతో భారత పురుషుల జట్టు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఆసియా క్రీడలకు పురుషుల ఇండియా-బీ జట్టును పంపించనుందని తెలుస్తోంది. ఇక మహిళల-ఏ జట్టు మాత్రం ఆసియా క్రీడల్లో తలపడనుంది. జూన్ 30 లోపు టీమ్‌ల వివరాలను ఒలంపిక్ అసోషియేషన్‌కు బీసీసీఐ పంపనుంది. గతేడాది జరగాల్సిన ఆసియా గేమ్స్.. చైనా జీరో కొవిడ్ పాలసీ వల్ల వాయిదా పడ్డాయి. ఐసీసీ మెగా టోర్నీకి ముందు ఇండియా-పాకిస్థాన్ జట్లు ఆసియాకప్, ఆసియా గేమ్స్ 2023లో రెండు సార్లు తలపడే అవకాశం ఉంది.
India ICC World Cup 2023 : ఐసీసీ మెగా టోర్నీకి ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. ఇప్పటికే కొందరు ప్లేయర్లు గాయాల బారిన పడి జట్టుకు దూరమవ్వగా.. మరి కొందరు ప్లేయర్లు ఫామ్‌లో లేకపోవడం, నిలకడ ప్రదర్శించకపోవడం వల్ల జట్టు పరిస్థితి దిగజారింది. దీనిపై మాజీ క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్‌సర్కార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బీసీసీఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023పై ఆందోళన నెలకొంది. భారత్ ఐసీసీ ట్రోఫీ గెలిచి 23 జూన్ 2023 నాటికి పదేళ్లు పూర్తయింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియాకు నిరాశే మిగిలింది. దీంతో ఈసారైనా ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.