భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ సమావేశం వర్చువల్ పద్ధతిలో డిసెంబర్ 21న జరగనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్స్, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం లాంటి విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వాటితో పాటు వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, కోచ్‌లను నియమించాలనే విషయంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శన ఆందోళన కలిగించే విధంగా ఉంది. దీంతో టీ20 ఫార్మాట్ కొత్త కెప్టెన్ నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. అదే జరిగితే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కోచ్‌లపై భారం పడకుండా.. రాహుల్ ద్రవిడ్‌ను టెస్టు, వన్డే కోచ్‌గా ఉంచి.. టీ20 బాధ్యతలను కొత్త కోచ్‌కు అప్పగిస్తారని సమాచారం. కాగా, టీమ్ సపోర్టింగ్ స్టాఫ్ పనితీరుపై బీసీసీఐ కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. వారిపై కూడా వేటు వేసి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంది.
కొత్త సెలెక్షన్ కమిటీని ఆమోదించి.. టీమ్ఇండియా జెర్సీ స్పాన్సర్లు బైజూస్, ఎంపీఎల్ల స్పాన్సర్షిప్ పురోగతిపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం; శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేయడం; జట్టు గాయాల మేనేజ్మెంట్ లాంటి అంశాలు చర్చించే అజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరగబోయే పింక్ బాల్ టెస్టుపై కూడా బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుందని సమాచారం.