ఆసియాలోని అగ్రశ్రేణి క్రికెట్ జట్ల మధ్య పోరాటానికి శనివారమే తెరలేవనుంది. ఆసియా కప్‌నకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరిగే ఈ టీ20 టోర్నీలో దాయాదితో టీమ్‌ఇండియా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ రోహిత్ సేన టైటిల్ నిలబెట్టుకోవాలంటే పాక్ అడ్డంకిని దాటాల్సిందే. మరి ఇంతటి ప్రతిష్ఠాత్మక పోరులో భారత బౌలర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పెద్దగా అనుభవం లేని ఇద్దరు పేసర్లు తీవ్ర ఒత్తిడిని దాటుకుని ఎలా రాణిస్తారన్నది చూడాలి. తొలి మ్యాచ్‌లో నెగ్గి భారత్ శుభారంభం చేయాలంటే పేసర్లు ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలిచిందంటే అందుకు బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణం. ఆ మ్యాచ్‌లో మన బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
కెరీర్‌కే కీలకం..: భారత్, పాక్ మ్యాచ్ అంటే కేవలం రెండు దేశాలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎన్నో భావోద్వేగాలు.. మరెంతో ఒత్తిడి ఉండే ఈ మ్యాచ్‌లో రాణించే ఆటగాళ్లు దేశానికి హీరోలుగా నిలుస్తారు. కానీ అదే మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమికి కారణమైతే మాత్రం అది ఆ క్రికెటర్ల భవిష్యత్‌పైనే ప్రభావం చూపుతుందనడం అతిశయోక్తి కాదు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్.. ఇదీ ఆసియా కప్‌లో మన పేస్ త్రయం. ప్రధాన ఫాస్ట్‌బౌలర్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా మారిన హర్షల్ పటేల్‌దీ అదే పరిస్థితి. షమిని పూర్తిగా టీ20 జట్టు పరిగణలోకే తీసుకోవడం లేదు. దీంతో ఇప్పుడు భారత్ ఆ ముగ్గురితోనే బరిలో దిగుతోంది. గతంలో ఎప్పుడూ జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదనే చెప్పాలి. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఇద్దరితో పాటు కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న భువనేశ్వర్ పేస్ భారాన్ని మోయనున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే యూఏఈ పిచ్‌లపై ఈ త్రయాన్ని ఆపడంలో మన పేసర్లు ఏ మేరకు సఫలమవుతారో చూడాలి. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత భువీ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల్లో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ నిలిచాడు. అయితే అతను ఎప్పుడెలా రాణిస్తాడన్నది ఊహించడం కష్టంగా మారింది. ఓ మ్యాచ్‌లో గొప్పగా బౌలింగ్ చేస్తే.. మరో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. అతని బౌలింగ్ సూపర్ అనేంతలోపే.. పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. ఇదీ కాకుండా మరోవైపు గాయల బెడద ఉంది. ఒకవేళ అతను గాయపడితే అప్పుడు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న! భువనేశ్వర్ ఇప్పటివరకు 72 టీ20ల్లో 73 వికెట్లు తీశాడు.
మైదానంలో పరీక్ష..: అర్ష్‌దీప్, అవేశ్ జట్టుకు కొత్త. కుదురుకునేందుకు ఇంకా వాళ్లకు సమయం కావాలి. మైదానంలోనే వాళ్లకు అసలు సవాలు ఎదురు కానుంది. అనుభవం లేని ఈ పేసర్లు తీవ్ర ఒత్తిడితో కూడిన పాక్‌తో మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది కీలకంగా మారింది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లే ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో చివరి ఓవర్లలో మెరుగైన బౌలింగ్‌తో టీమ్‌ఇండియాకు ఎంపికైన అతని ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. పైగా లెఫ్టార్మ్ పేసర్ కావడం జట్టుకు లాభించే అంశం. ఇక ఐపీఎల్‌లోనే మెరుగైన ప్రదర్శనతో జట్టులో చోటు దక్కించుకున్న అవేశ్ పూర్తిస్థాయిలో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఓ మ్యాచ్‌లో రాణిస్తే.. మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. పరుగుల కట్టడిలో వెనకబడుతున్నాడు. ఇటీవల జింబాబ్వేతో మూడో వన్డేలో వికెట్లు పడగొట్టినప్పటికీ 48వ ఓవర్లో 16 పరుగులిచ్చి జట్టును కంగారు పెట్టాడు. ఇప్పటివరకు రెండు వన్డేలు, 13 టీ20లు ఆడిన అతను.. పొట్టి ఫార్మాట్లో 11 వికెట్లు సాధించాడు. కానీ ఎకానమీ 8.67గా ఉండడం ఆందోళన కలిగించే విషయమే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌తో సరికొత్తగా మారిన హార్దిక్ పాండ్య.. మళ్లీ పేస్ ఆల్‌రౌండర్‌గా మెప్పిస్తున్నాడు. ఆరంభ ఓవర్లలో బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లూ పడగొడుతున్నాడు. కానీ అతను ఇదే నిలకడ కొనసాగిస్తాడా? అన్నది పెద్ద ప్రశ్న. 67 టీ20ల్లో 50 వికెట్లు పడగొట్టిన అతను పాక్‌తో కీలక మ్యాచ్‌ల్లో బంతితోనూ రాణించాల్సిన అవసరం ఉంది. ఇక మ్యాచ్‌లు జరిగే యూఏఈలో స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను చాహల్, అశ్విన్, జడేజా ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటారన్నది కీలకం.
22.. ఆసియా కప్‌లో భారత్ తరపున ఇప్పటివరకు జడేజా పడగొట్టిన వికెట్లు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్ల తీసిన టీమ్‌ఇండియా బౌలర్లలో అతను మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదీ చూడండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, భారత్ పాక్ మ్యాచ్ టికెట్స్ రిలీజ్