లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. పరిస్థితులు కుదుటపడితే మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. కానీ చాలా మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. క్యూఆర్ కోడ్ టికెట్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, స్టాళ్లలో విక్రయదారులు, వినియోగదారుల మధ్య గ్లాస్ డోర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని చెబుతున్నారు.
వీటన్నింటిలో భౌతిక దూరానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. హాళ్లలో క్లస్టర్ సీటింగ్ ఏర్పాటు చేస్తారు. శానిటైజర్, ఫేస్‌మాస్క్ ప్రతి ఒక్కరూ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. 3డీ చిత్రమైతే ఎవరి అద్ధాలను వాళ్లు కొనుక్కోవాల్సిందే.
పెద్ద సినిమాల జోరుతో..
జూన్ 15 నుంచి జులై 15 మధ్యలో ఏ సమయంలోనైనా సినిమా హాళ్లు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విడుదలకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్లో అక్షయ్, అజయ్ దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్ చిత్రం 'సూర్యవంశి', రణ్వీర్ సింగ్ '83', రాధే వంటి భారీ చిత్రాలు పూర్తయ్యాయి.
పోటీ తట్టుకోలేక..
అయితే ఓపిక పట్టలేని కొంతమంది నిర్మాతలు ఓటీటీ వేదికల్లో చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన గులాబో సితాబో చిత్రం మిగతా వాటికి దారి చూపిస్తోంది. తీసుకున్న అప్పులపై వడ్డీ భారం పెరుగుతుండటం, బీమా లేకపోవటం, అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలు ఓటీటీలకు మొగ్గుచూపుతున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ చెబుతోంది.
అయితే ఈ దిశగా అడుగులు వేయటానికి పీవీఆర్ ఛైర్మన్ అజయ్ బిజిలీ నిరాకరిస్తున్నారు. ఇది నిర్మాణాత్మకమైన మార్పు కాదని, వెండితెరపై ఇలా చిన్న తెరలపై విడుదలకు ఏ నిర్మాత ఇష్టపడరని అన్నారు. అంతేకాకుండా 45 శాతం ఆదాయం థియేటర్ల నుంచి వస్తోందని.. మిగతా భాగాన్ని శాటిలైట్, డిజిటల్ హక్కులు పంచుకుంటాయని తెలిపారు.
చిన్న సినిమాలే ఓటీటీకి..
ఏదేమైనా థియేటర్ అనుభూతిని మించినది మరొకటి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్న చిత్రాల నిర్మాతల మాట మరోలా ఉంది. రెండింటి ద్వారా వారికి లభించే అదాయం దాదాపు సమానమే కావటం వల్ల ఓటీటీకి మొగ్గు చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కరోనా తర్వాత 10శాతం ఉండే పెద్ద సినిమాలు, హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలన్నీ పెద్ద తెరపై.. తక్కువ బడ్జెట్ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలకు పరిమితమయ్యే రోజులు వస్తాయని చెబుతున్నారు.
వేదిక ఏదైనా కథే ముఖ్యం..
అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఫోర్ మోర్ షాట్స్ దర్శకురాలు భిన్నంగా స్పందించారు.
"సిరీస్, సినిమాలు రెండూ భిన్నమైన అంశాలు. కథన ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేను కథకురాలిని. ప్రేక్షకుడికి అర్థమయ్యేలా మంచి కథనాన్ని అందించేలా చూడాలి. దీనికి మాధ్యమం ఏది అనే విషయంపై నాకు పట్టింపు లేదు. ఎక్కవమంది ప్రేక్షకులను విషయం చేరితే అంతకన్నా ఏం కావాలి?"
- అను మేనన్, దర్శకురాలు
చిత్రీకరణకు సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా చిత్రీకరణలో చాలా మంది పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో శుభ్రత, భద్రతా ప్రమాణాల విషయంలో సందిగ్ధం నెలకొంది. చాలా సినిమాలు చిత్రీకరణలో చివరి దశలో ఉండగా.. మరికొన్ని మధ్య దశలో ఉన్నాయి.
మార్పు తప్పదు..
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విషయంలోనూ అనిశ్చితి నెలకొంది. చిత్ర పరిశ్రమపై ఆధారపడి 50 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డారు. అయితే ఇది మళ్లీ పునరుజ్జీవంలోకి రావటానికి చాలా మార్పులు జరగాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశాన్ని బట్టి కొన్ని విషయాలు మారుతూ ఉంటాయి. అమెరికాలో నాలుగు ప్రధాన స్టూడియోలు, పెద్ద ఎగ్జిబిటర్ వ్యవస్థలు ఉన్నాయి. అదే భారత్‌లో నిర్మాతలు చాలా మంది ఉంటారు. అమెరికాలో ఏటా 200 సినిమాలు నిర్మిస్తే భారత్‌లో 1,000 నుంచి 1,200 సినిమాలు వస్తాయి.
అయితే సినిమాలే ప్రపంచంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. సినిమా ఆకలి చాలా పెద్దది. ఒక వైరస్ దీన్ని నాశనం చేయగలదా?
(రచయిత- కావేరీ బమ్జాయ్, సీనియర్ పాత్రికేయులు, సీఐఐ జాతీయ కమిటీలో సభ్యులు )