ఆసక్తికరమైన ట్విస్టులతో, ఆకట్టుకునే విజువల్స్‌తో సాధారణ కథను.. ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా తెరకెక్కించడం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి సొంతం. అయితే భారత ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని ఈయన వెండితెరపై ఆవిష్కరిస్తే చూడాలని సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాల్మీకి రామాయణాన్ని ధారావాహికగా రూపొందించి, ప్రేక్షకులను మెప్పించారు దర్శక-నిర్మాత రమానంద సాగర్. 1987లో ప్రసారమైన ఈ సీరియల్‌ను ప్రేక్షకుల కోరిక మేరకు, లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం పునఃప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 7.7 కోట్ల మందికి పైగా వీక్షకులతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ట్విటర్ వేదికగా 'రాజమౌళి సర్.. రామాయణం చేయండి' అని పేర్కొంటూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్‌ను రాముడిగా చూడాలనుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నారు. నెటిజన్ల వరుస ట్వీట్లతో #రాజమౌళిమేక్రామాయణ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్ ఇండియా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయమై రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాను 'మహాభారతం' సినిమా తీస్తానని చాలా సందర్భాల్లో ఇదివరకే ప్రకటించారు ఈ దర్శకుడు.
ప్రస్తుతం రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ఆశిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు సందడి చేయనున్నారు. ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత తన తదుపరి సినిమా మహేశ్‌బాబుతో చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి : 'అలాంటి లవ్‌లెటర్స్ చదవడం ఎంతో బాగుంటుంది'