వాళ్లంతా ఇన్ని రోజులు వెండితెరకు వన్నెలద్దిన ముద్దుగుమ్మలు. ఇప్పుడు డిజిటల్ తెరల కోసం ముఖానికి రంగులద్దుకుంటున్నారు. అందరూ సినిమాల్లో కథానాయికలుగా మెప్పించినవారే.. ఇప్పుడు వెబ్‌సిరీస్‌ల్లో జోష్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఓటీటీ వేదికలపై తెరంగేట్రం చేసి.. అభిమానుల అరచేతుల్లో అల్లరి చేయనున్నారు ఆ తారలు. ఆ విశేషాలేంటో మీరూ తెలుసుకోండి.
ప్రతికూల పాత్రతో...
ఇన్ని రోజులు సమంత మనందరికీ హీరోయిన్‌గానే పరిచయం. కానీ త్వరలో ఆమె ప్రేక్షక లోకాన్ని విలన్‌గా పలకరించబోతోందా? అంటే అవుననే అంటోంది వెబ్ ప్రపంచం. హిందీలో సూపర్ హిట్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండో సిరీస్‌తో ఓటీటీ వేదికల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది సామ్. ఎప్పుడూ చూడని ప్రతికూల పాత్రలో మెప్పించనుంది.
"డిజిటల్ తెరలకు ఆదరణ పెరుగుతోంది. నేనూ ఈ విప్లవంలో భాగం కావాలనుకుంటున్నా. చాలా మంది భారతీయులు ఇష్టపడే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీల్లోకి ప్రవేశించడం ఆనందంగా ఉంది'
సమంత అక్కినేని, సినీ నటి
నటిగా సంతృప్తి చెందా...
ముద్దు ముద్దు మాటలతో, అందమైన అభినయంతో అభిమానుల్ని ఫిదా చేస్తుంది నిత్యా మేనన్. ఇప్పుడీ అమ్మడు ఓటీటీ వేదికల్లో తెరంగేట్రం చేయడానికి బాలీవుడ్ కథానాయకుడు అభిషేక్ బచ్చన్‌తో జట్టుకట్టింది. 'బ్రీత్' వెబ్‌సిరీస్‌తో త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. సైకలాజికల్ క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి మయాంక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
"ఇది నేను నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్. ఇలాంటి మాధ్యమాల్లో వచ్చే చిత్రాలు నాకు బాగా నప్పుతాయి. 'బ్రీత్'లో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాలో దాగి ఉన్న నటిని ఇది సంతృప్తి పరిచింది. పూర్తి స్థాయిలో నా ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం దక్కింది
నిత్యా మేనన్, సినీ నటి
ప్రేమ కథతో...
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేసుకుంటూ బిజీగా గడిపేస్తోంది అమలాపాల్. అయినా సరే ఈ మలయాళి భామ వెబ్ సిరీస్‌ల బాట పట్టింది. 1970ల్లో బాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఒక చిన్న నిర్మాత ప్రేమాయణం సాగిస్తాడు. ఈ కథాంశంతో డిజిటల్ తెరపైకి రానుంది అమలాపాల్. దీన్ని మహేష్ భట్ నిర్మిస్తున్నారు.
"బాలీవుడ్‌లోని ఓ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లో భాగం అవడం ఆనందంగా ఉంది. బాలీవుడ్, డిజిటల్ వేదికల్లో తెరంగేట్రం చేయడానికి నేను ఈ కథకు మించి ఏం కోరుకోను" అంటూ అమలా పాల్ దీని గురించి చెప్పుకొచ్చింది. అంతే కాదు ఈ చిన్నది 'లస్ట్' తెలుగు రీమేక్‌లోనూ నటిస్తోంది.
నన్ను నేను నిరూపించుకోవడానికే...
'బాహుబలి' లాంటి పెద్ద సినిమాల్లో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకుంది తమన్నా. అయినా సరే మనలో ఉన్న ప్రతిభను చూపించుకోవడానికి ఓటీటీలే మంచి వేదికలని చెబుతోందీ మిల్క్‌బ్యూటీ. తండ్రి కూతుళ్ల అనుబంధంతో రూపొందుతున్న సినిమాతో డిజిటల్ వేదికలపై అడుగు పెట్టనుంది తమన్నా. ఇందులో ఆమె తండ్రిగా జీఎం కుమార్ నటించనున్నారు. ఈ సినిమాకు రామసుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. "ఒక వెబ్ సిరీస్ కనీసం ఐదు సినిమాల నిడివితో సమానం. ఇది నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు మంచి వేదిక. ఇందులో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి"అని అంటోంది తమన్నా.
మహిళా సమస్యలపై...
అంతరిక్షంలోకి దారులు వెతుక్కుంటున్న ఈ కాలంలోనూ అతివ సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ఒక మహిళ వీటన్నింటికీ ఎలా ఎదురు తిరుగుతుందన్న కథాంశంతో వస్తున్న వెబ్‌సిరీస్‌లోకి అడుగుపెట్టనుంది హన్సిక. దీన్ని 'భాగమతి' ఫేం దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తున్నారు. "విభిన్నంగా ఉండే థ్రిల్లర్ పాత్రలో చేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ ఎక్కువ భాగం రాత్రి వేళల్లోనే చిత్రీకరించాం. ఇప్పుడున్న యువతలాగే అందులో చాలా పాత్రలు కనిపిస్తుంటాయి"
హన్సిక, సినీ నటి
హాలీవుడ్ అవకాశాలు రావొచ్చు...
చిత్రసీమలో ఎన్నో ఏళ్ల క్రితం అడుగుపెట్టినా ఈశా రెబ్బాకు నటిగా సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. 'అరవింద సమేత' వంటి హిట్టు చిత్రం ఆమె ఖాతాలో ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే డిజిటల్ తెరపై తానేంటో నిరూపించుకోవాలన్న కసితో ఉంది. కియారా అద్వానీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'లస్ట్' వెబ్ సిరీస్ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టైంది. దీని తెలుగు రీమేక్‌లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంది. "డిజిటల్ వేదికల్లో గుర్తింపు పొందడానికి ఎన్నో పాత్రలు చేయొచ్చు. ఇవి ఎన్నో భాషల్లోకి డబ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఇలా హాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు" అని గొప్పగా చెబుతోంది ఈశా.