కరోనా ప్రభావంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీనికి స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సెలిబ్రిటీలు కూడా తమవంతు బాధ్యతగా సామాజిక మాధ్యమాల వేదికగా పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా 'ఆర్ఆర్ఆర్' హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు సలహాలు ఇచ్చారు. ఈ వీడియోనూ నెట్టింట షేర్ చేశారు.
తారక్, చరణ్ చెప్పిన సూచనలు
1. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లో కూడా. బయటకు వెళ్లొచ్చినపుడో లేదా భోజనానికి ముందో ఇలా కనీసం రోజుకి ఏడెనిమిది సార్లు శుభ్రం చేసుకోండి.
2. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వారు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు తుడుచుకోవడం, ముక్కు రుద్దుకోవడం, నోట్లో వేళ్లు పెట్టుకోవడం కూడా మానేయాలి.
3. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేస్కుంటే అనవసరంగా కొవిడ్ 19 మీకూ అంటుకునే ప్రమాదం ఉంది.
4. తుమ్మినపుడు, దగ్గినపుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి.
5. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువగా తాగండి. గడగడా తాగేయడం కన్నా.. ఎక్కువసార్లు కొంచె కొంచెం తాగండి. వేడి నీళ్లయితే ఇంకా మంచిది.
6. వాట్సప్‌లో వచ్చే ప్రతివార్తని నమ్మకండి. వాటిలో నిజమెంతో తెలియకుండా షేర్ చేయకండి. దానివల్ల అనవసరంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి.