సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ (సైమా) వేడుక మరికొన్ని రోజుల్లోనే సందడి చేయనుంది. అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఈ అవార్డులని ఎవరెవరు అందుకుంటారా? అనే ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే పలు విభాగాలకి సంబంధించిన నామినేషన్లని ప్రకటించిన సైమా తాజాగా 2020 సంవత్సరానికిగానూ ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడికి పోటీ పడుతున్న వారి జాబితాని విడుదల చేసింది. ఆ వివరాలివీ..
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో), మహేశ్ బాబు (సరిలేరు నీకెవ్వరు), సుధీర్‌బాబు (వి), సత్యదేవ్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), నితిన్ (భీష్మ).
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్ర ప్రసాద్ (సరిలేరు నీకెవ్వరు), మురళీశర్మ (అల వైకుంఠపురములో), నరేశ్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), రావు రమేశ్ (సోలో బ్రతుకే సో బెటర్), తిరువీర్ (పలాస 1978).
విజేతలను ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా నిర్ణయించునున్నారు. www.siima.in వెబ్‌సైట్‌తో పాటు SIIMA ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రేక్షకులు తమ అభిమాన నటుడికి ఓట్లు వేసి గెలిపించవచ్చు. మరి ఎవరు ఈ అవార్డుని అందుకుంటారో తెలియాలంటే సెప్టెంబరు 18 వరకు ఆగాల్సిందే. హైదరాబాద్ వేదికగా సెప్టెంబరు 18, 19 తేదీల్లో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు దూరమవడం వల్ల 2019, 2020 సంవత్సరాలకి సంబంధించిన అవార్డుల్ని 2021లోనే ఇవ్వనున్నారు.