Tollywood new combinations: మహేష్‌బాబుతో త్రివిక్రమ్ సినిమా కోసం మరోసారి పూజాహెగ్డే జోడీ కట్టబోతోంది. ఎన్టీఆర్‌తో నటించేందుకు పచ్చజెండా ఊపేశానని అలియాభట్ స్వయంగా చెప్పేసింది. జాన్వీ కపూర్ తెలుగు కథలు వింటోందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవలే ఓ సినిమా వేడుకలో చెప్పారు. ఇలా కథానాయికల సరికొత్త సంగతులు, ఖరారైన కొత్త ప్రాజెక్టుల వివరాలు తరచూ బయటికొస్తూనే ఉన్నాయి. చిత్రసీమలో ఖరారైనవే కాదు.. పక్కా కావడానికి అటూ ఇటూగా ఉన్న కొన్ని కలయికల ముచ్చట్లు కూడా వినిపిస్తుంటాయి. అవి సినీ ప్రేమికుల్ని మరింత ఆసక్తికరంగా మాట్లాడుకునేలా చేస్తుంటాయి. ఆ జోడీ కలుస్తుందా లేదా? అనే ఉత్సుకతని రేకెత్తిస్తుంటాయి. ఆ తరహా వెలుగులోకి వచ్చిన కొన్ని కలయికల సంగతులే ఇవి..
Ramcharan Rashmika new movie: తెలుగు చిత్ర పరిశ్రమలో తరచూ రామ్‌చరణ్ - రష్మిక జోడీ గురించి చర్చ జరుగుతుంటుంది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలోనూ రష్మిక ఖాయమైందనే ప్రచారం సాగింది. కానీ ఆ అవకాశం కియారా అడ్వాణీ సొంతం చేసుకుంది. అయినా చరణ్ - రష్మిక జోడీపై సినీ అభిమానులకి ఆసక్తి తగ్గలేదు. అందుకు తగ్గట్టే కొందరు దర్శకనిర్మాతలు ఆ కలయికలో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్టు సమాచారం. అందులో నాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలోనూ రామ్‌చరణ్ మరో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. అందులోనూ రష్మిక నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది పరిశ్రమ వర్గాలు చెప్పే మాట.
Vijay devarkonda Samantha movie: విజయ్ దేవరకొండ - సమంత కలయికలోనూ సినిమా ఖాయమైందనే మాట గట్టిగానే వినిపిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చాలా రోజుల కిందటే ఖరారైంది. కానీ విజయ్ చేస్తున్న సినిమాలు పూర్తి కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకి ఈ ఇద్దరూ కలిసి రంగంలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందులో నాయికగా సమంత ఖాయమైనట్టే అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చిత్రవర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదివరకు విజయ్, సమంత ‘మహానటి’లో కలిసి నటించారు. ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రాన్ని పూర్తి చేశారు విజయ్.
Nagachaitanya pooja hegdey new movie: నాగచైతన్య - పూజా హెగ్డే జోడీ కూడా మరోసారి సందడి చేయనుందనే ప్రచారం సాగుతోంది. ‘ఒక లైలా కోసం’లో కలిసి నటించిన ఈ జోడీతో ఈసారి తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు ఓ సినిమా చేయనున్నట్టు తెలిసింది. ‘రాధేశ్యామ్’ ప్రచారంలో బిజీగా గడుపుతున్న పూజా కొత్తగా ఒప్పుకున్న ప్రాజెక్టుల్లో నాగచైతన్య -వెంకట్‌ప్రభు సినిమా ఒకటని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా రూపొందుతున్నాయి. అందుకు తగ్గట్టే నాయికల్ని ఎంపిక చేసుకుంటున్నాయి ఆయా సినిమా బృందాలు. తెలుగులో సినిమాలు చేస్తున్న సింహభాగం కథానాయికలు మొదట్నుంచీ రెండు మూడు భాషల్లో నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఇప్పుడు వాళ్లకి కలిసొస్తోంది. బాలీవుడ్ భామలు విరివిగా తెలుగు సినిమాలకి ఎంపికవుతున్నా.. ఇక్కడి నాయికల అవకాశాలకి ఏమాత్రం ఢోకా కనిపించడం లేదు.
ఇదీ చదవండి: Oscar awards 2022: ఆస్కార్‌ను ముద్దాడే ఉత్తమ కెప్టెన్ ఎవరో?