అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన పన్నును సవాల్ చేస్తూ రజనీ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది.
ఏం జరిగింది?
చెన్నై కొడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపం రజనీకాంత్ పేరిట ఉంది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ఈ కల్యాణ మండపాన్ని మూసేశారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి అందులో వేడుకలు జరగలేదు.
అయితే కల్యాణ మండపానికి రూ.6.50 లక్షల పన్ను చెల్లించాలంటూ చెన్నై కార్పొరేషన్ రజనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. లాక్‌డౌన్‌లో ఫంక్షన్ హాల్‌ను మూసేశామని, దాని నుంచి ఆదాయం రాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు పన్ను వేస్తూ కార్పొరేషన్ నోటీసులు పంపడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. పిటిషన్‌ను తప్పుబట్టింది. పన్ను వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసినందుకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో కేసును ఉపసంహరించుకోవడానికి రజనీ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని గడువు కోరారు.