ఎన్ని పనులు చేసినా తన దృష్టి పాటలపైనే అంటున్నారు గీత రచయిత కృష్ణకాంత్ (కేకే). 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' నుంచి ఆయన కలం మెరుపులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల 'శ్యామ్ సింగరాయ్', 'రాధేశ్యామ్' తదితర చిత్రాలకు పాటలు రాశారు. సోమవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కేకే తన గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ విషయాలివీ..
"ఏడాది కాలంలో 45కిపైగా సినిమాలకు పాటలు రాశా. అందులో 15 సినిమాలు విడుదలయ్యాయి. 'మాస్టర్', 'శ్రీకారం', 'ఎస్.ఆర్.కళ్యాణమంటపం', 'పాగల్'... ఇలా విడుదలైన వాటిలో నేను రాసిన 32 పాటలు బయటికొచ్చాయి. 'రాధేశ్యామ్'తోపాటు, 'హిట్ 2', 'మేజర్', 'రౌడీ బాయ్స్', 'పక్కా కమర్షియల్', 'ఒకే ఒక్క జీవితం', 'హను-మాన్', హను - దుల్కర్ సినిమా... ఇలా ఆసక్తికరమైన సినిమాలు చాలానే విడుదల కావల్సి ఉన్నాయి. 'రాధేశ్యామ్'లో నేను రాసిన ఈ రాతలే... పాటకి మంచి స్పందన లభించింది. ఇదొక ప్రేమకథ కాబట్టి... ప్రతీ పాట కవితాత్మకంగా ఉంటుంది. 'సాహో' తర్వాత మళ్లీ ప్రభాస్ సినిమా 'రాధేశ్యామ్'కి రాయడం ఎంతో తృప్తినిచ్చింది. ఇప్పటివరకు ఓ స్థాయి బడ్జెట్, హీరోల సినిమాలకే రాశా. 'రాధేశ్యామ్'తో నా పనితీరుకి కొత్త తలుపులు తెరుచుకున్నట్టైంది".
"నా ప్రయాణంలో ఇప్పటివరకు 300కిపైగా పాటలు రాశా. అనువాద చిత్రాలతో కలుపుకొంటే ఆ సంఖ్య 400 ఉంటుంది. ప్రేమ పాటైనా, బ్రేకప్ పాటలైనా కేకే బాగా రాస్తాడనే పేరొచ్చింది. అదెంతో సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్నిచ్చే విషయం. ప్రేమ పాటలనే కాదు... నేను అన్ని రకాల పాటలూ రాస్తా. 'రాధేశ్యామ్' ఆల్బమ్‌లో అన్ని పాటలూ ఉంటాయి. 'జెర్సీ'లో ప్రేమతోపాటు, స్ఫూర్తిని నింపే గీతాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’లోనూ అంతే. నేను రాసే పాటలకి ఆయా కథలు, పాత్రలు, సందర్భాలే స్ఫూర్తి. ‘శ్యామ్ సింగరాయ్’ టైటిల్ గీతాన్నే తీసుకుంటే ఒక దేవదాసీ వ్యవస్థని నిర్మూలించాలని నడుం బిగిస్తాడు కథానాయకుడు. 'పుట్టిందా ఓ అక్షరమే, కాగితపు కడుపు చీల్చే..' అని పాట మొదలుపెట్టా. ఆ వ్యక్తీకరణకి పాత్రే మూలం. పాటలతో పాటు కొన్ని చిత్రాలకి మాటలూ రాస్తున్నా."
ఇదీ చూడండి: టాలీవుడ్‌ను పలకరించనున్న కొత్త అందాలు ఇవే!