కన్నడ 'పవర్‌స్టార్' పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఎంతో మందికి తీరని శోకం మిగిల్చింది(puneeth rajkumar death news). ఆయన మరణంతో అభిమానులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే పునీత్ ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేవారని.. ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణాలు చెప్పడం అసాధ్యమని రాజ్‌కుమార్ ఫ్యామిలీ వైద్యుడు రమణరావు పేర్కొన్నారు(puneeth rajkumar death reason). శుక్రవారం పునీత్ తన వద్దకు ఎలా వచ్చారో.. అక్కడ ఏం జరిగిందో ఆ వైద్యుడు వెల్లడించారు.
ఓ మీడియా సంస్థతో రమణరావు మాట్లాడుతూ.. "నలతగా ఉందంటూ భార్య అశ్వినితో కలిసి పునీత్ నన్ను సంప్రదించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన నుంచి ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదు. పలు పరీక్షలు చేశాను. ఆయన బీపీ సాధారణంగానే ఉంది. గుండె స్థిరంగా కొట్టుకుంది. ఊపిరితిత్తుల్లోనూ ఎలాంటి సమస్యా లేదు. కానీ, చెమటలు కారిపోతున్నాయి. అయితే వ్యాయామం తర్వాత ఇది సాధారణమేనని ఆయన చెప్పారు. ఎందుకైనా మంచిదని ఈసీజీ పరీక్ష చేశా. అందులో ఓ స్ట్రెయిన్‌ను గుర్తించాను. వెంటనే స్థానిక విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అశ్వినికి సూచించాను. వారు కారు ఎక్కగానే విక్రమ్ ఆసుపత్రికి కాల్ చేసి ఐసీయూ సిద్ధం చేయాలని సూచించాను. ఐదారు నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ఆయనను బతికించుకోలేకపోయాం" అని రమణరావు పేర్కొన్నారు.
పునీత్ గురించి ఆ వైద్యుడు మరిన్ని విషయాలు వెల్లడించారు. "ఆరోగ్యం పట్ల అప్పూ ఎంతో శ్రద్ధ వహించేవారు. పునీత్‌ను చూసి నేర్చుకోవాలని ఎంతో మందికి సలహాలు ఇచ్చేవాడిని. ఇదో హఠాత్పరిణామం. ఇది గుండెపోటు కాదు (గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం). కార్డియాక్ అరెస్ట్ (గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం). ఈ కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. కానీ అప్పు విషయంలో ఇవేవీ కనిపించలేదు. ఆయనకు మధుమేహం, అసాధారణ రక్తపోటు లాంటివి ఏమీలేవు. అప్పూ విషయంలో ఏం జరిగిందో కచ్చితంగా చెప్పడం అసాధ్యం" అని వెల్లడించారు.
బెంగళూరు చేరుకున్న పునీత్ కుమార్తె
అమెరికా నుంచి వచ్చిన పునీత్ పెద్ద కుమార్తె ధృతి బెంగళూరు చేరుకున్నారు. తండ్రి పార్థివదేహం చూసి విలపించారు. ఆమె కోసమే పునీత్ అంత్యక్రియలు ఆలస్యమయ్యాయి. ఆదివారం(అక్టోబర్ 31) అంత్యక్రియలు జరపనున్నారు.
ఇదీ చూడండి: