సాయిధరమ్ తేజ్ పరిమితికి మించిన వేగంతో వెళ్లడం సహా హెల్మెట్ సరిగ్గా ధరించకపోవడం వల్లే ప్రమాదంలో గాయపడ్డాడని మాదాపూర్ డీసీపీ వేంకటేశ్వర్లు తెలిపారు. ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైనప్పుడు గంటకు 75 కి.మీల వేగంతో ప్రయాణిస్తున్నాడని.. దుర్గం చెరువు కేబుల్ వంతెన పైనుంచి వచ్చేటప్పుడు సుమారు 100 కి.మీల వేగంతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
కేబుల్ వంతెనపై నిర్దేశించిన వేగం మాత్రం 30 నుంచి 40 కి.మీలు మాత్రమేనని వేంకటేశ్వర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన రహదారిపైనా 30కి.మీల వేగ పరిమితి ఉందని వేంకటేశ్వర్లు తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని.. సాయిధరమ్ తేజ్ ఇతర వాహనాలను నిర్లక్ష్యంగా ఓవర్ టేక్ చేశాడని డీసీపీ తెలిపారు.
ఎల్బీ నగర్‌కు చెందిన అనిల్ నుంచి ట్రంప్ బైక్‌ను 2019 చివర్లో సాయిధరమ్ తేజ్ కొనుగోలు చేశాడని.. ఇప్పటికీ వాహనం అనిల్ పేరు మీదే ఉందని వేంకటేశ్వర్లు తెలిపారు. గతేడాది ఆగస్టు2న అతివేగంగా వెళ్లినందుకు ట్రంప్ బైక్ పై రూ.1135 జరిమానా పడిందని.. ఈ రోజు ఆ చలానా డబ్బులను ఎవరో చెల్లించారని వేంకటేశ్వర్లు తెలిపారు.
సాయిధరమ్ తేజకు కార్లు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు ఉందని.. ద్విచక్రవాహనాలు నడిపేందుకు లైసెన్స్ ఉందా లేదా అనే వివరాలు సేకరిస్తున్నామని మాదాపూర్ డీసీపీ పేర్కొన్నారు. దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా మీదుగా గచ్చిబౌలీ వెళ్లే దారిలో వేగ పరిమితికి సంబంధించి తగిన బోర్డులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మాదాపూర్ జోన్ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఇవీ చదవండి: