అమెరికా వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా 22వ సభలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తానా సభలలో మాట్లాడిన పవన్...ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఓ కొత్త అనుభూతి లభించిందని తెలిపారు. 2009-11 సంవత్సరాల్లో లాస్ఏంజెల్స్లో ఉన్నానన్న పవన్... కష్టకాలంలో అమెరికాలో ఉన్న తెలుగువారు తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తానా తెలుగువారందరినీ ఏకం చేసి, మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. విదేశాల్లో ఉంటున్నా తెలుగు సాహిత్యం, సంస్కృతిని కాపాడేందుకు తానా నిరంతరం కృషి చేస్తోందని పవన్ చెప్పారు.
ఓటమి ముందే ఊహించా
తెలుగు వారి వల్లే యూఎస్‌లో తన సినిమాలకు మంచి మార్కెట్ వచ్చిందని పవన్ చెప్పారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై మాట్లాడిన ఆయన...ఓటమిని ముందే ఊహించానన్నారు. ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ స్థాపించానన్న పవన్...ప్రజల ఐక్యత, సమగ్రత కోసం పార్టీ పెట్టానన్నారు. ప్రజల కష్టాలను తన గొంతుతో ప్రశ్నించాలనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
ప్రజా సమస్యలపై సినిమాల్లో గంటలకొద్దీ డైలాగ్స్ కొట్టడం వృథా ప్రయాస అన్న పవన్....నిజ జీవితంలో ప్రశ్నిస్తేనే ఉపయోగమన్నారు. ఓటమిని ఒప్పుకున్నానన్న పవన్...అపజయం తనకు పాఠాలను నేర్పిందన్నారు. ఓటమికి భయపడనన్న పవన్, ధైర్యంగా నిలిచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తనకు కొత్తేమీకాదని స్పష్టం చేశారు.
సినిమాల కన్నా రాజకీయాలే సమాజంలో గుణాత్మక మార్పులు తెస్తాయి. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. అన్నింటినీ తట్టుకుని నిలబడే ఓపిక నాకు ఉంది. ----పవన్ కల్యాణ్
కుల, మత రాజకీయాలు చేయలేను
కుల, మతాలకతీతంగా తెలుగు వారందరూ ఒక్కటిగా నిలవాలని అభిలాషించారు పవన్. మనుషులను కలిపే రాజకీయాలే చేస్తా తప్ప...రాజకీయ లబ్ది కోసం కుల, మత రాజకీయాలు చేయలేనని పవన్ అన్నారు. సమాజ సమగ్రత కోసమే రాజకీయాలకు వచ్చానని జనసేనాని తెలిపారు. విచ్చిన్న రాజకీయాలు పోయి స్వచ్ఛ రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. సినిమాల్లో ఉంటే తనను విమర్శించేవాళ్లు తక్కువ ఉండేవారన్న పవన్.. రాజకీయాల్లో విమర్శలు వస్తాయని తెలిసినా ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఓటమి నుంచి 15 నిమిషాల్లో బయటపడ్డానని పవన్ తెలిపారు.
ఇదీ చదవండి : ఆ కథకు ప్రభాస్ సరిపోతాడంటున్న యశ్