బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. ముంబయిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. గత శనివారమే అతడి తల్లి సయిదా బేగం.. రాజస్థాన్‌లోని జైపుర్‌లో మరణించారు. భారత్‌లో లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల ఆమెను ఇర్ఫాన్ కడసారి చూసే అవకాశం లేకుండా పోయింది. తల్లి అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారానే ఇర్ఫాన్ చూశారని అతడి సన్నిహితులు తెలిపారు. ఇలా ఆ కుటుంబంలో వరుస మరణాలు సంభవించడం బంధువులు, సన్నిహితుల్ని తీవ్రంగా కలచివేసింది. ఈయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
54 ఏళ్ల ఇర్ఫాన్.. కొన్నేళ్లుగా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. అతడికి ఈ వ్యాధి వచ్చినట్లు 2018లో నిర్ధరణ అయింది. అప్పుడే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు ఇర్ఫాన్.
"నా జీవితంలో ఉన్నట్లుంది ఇలా జరిగింది. ఇలానే ముందుకు సాగాలి. చివరి రోజులు దీనితోనే గడపాలి. నాకు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. కానీ నా చుట్టుపక్కల ఉన్న నన్ను ప్రేమించే మనుషులే.. నాకు జీవితంపై ఆశను, జీవించడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తున్నారు" అని అప్పట్లో ఇర్ఫాన్ ట్వీట్ చేశారు.
ఈ వ్యాధి ఉందని తేలిన తర్వాత లండన్‌లో సంవత్సరం పాటు చికిత్స తీసుకుని వచ్చారు ఇర్ఫాన్. అనంతరం ముంబయిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తను చివరగా నటించిన 'అంగ్రేజీ మీడియం' షూటింగ్‌లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణకు హాజరై, దానిని పూర్తి చేశారు.