'నువ్వొస్తానంటే నేనొద్దంటానా!', 'బొమ్మరిల్లు' లాంటి ఎన్నో ప్రేమ, కుటుంబకథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సిద్ధార్థ్. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తన రీఎంట్రీ గురించి తెలియజేస్తూ.. అభిమానుల ఆశీస్సులు కావాలని కోరాడు.
'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మహాసముద్రం'. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనిపించనున్నారు.
నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో సిద్ధార్థ్ పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టాడు.
"ఎనిమిదేళ్ల అనంతరం మొదటిసారి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నా. వచ్చే నెల నుంచి సెట్‌లో అడుగుపెట్టనున్నా. అద్భుతమైన టీమ్‌తోపాటు మంచి సహనటులతో పనిచేయనున్నా. చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు కావాలి"
-సిద్దార్థ్, నటుడు
2013లో విడుదలైన 'జబర్‌దస్త్' చిత్రం తర్వాత సిద్ధార్థ్ తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అదే ఏడాదిలో విడుదలైన 'బాద్‌షా' సినిమాలో ఆయన ఓ కీలకమైన పాత్రలో కనిపించాడు. అనంతరం ఏ తెలుగు సినిమాలో నటించలేదు.