Director purijagannadh puri missings: ప్రపంచంలో ఆడవాళ్లు లేకపోతే ఏడుపులు ఉండవనే భావన తప్పని, ఆడవాళ్లు ఎప్పుడూ ఏడవకూడదని ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ అన్నారు. తాజాగా ఆయన పూరి మ్యూజింగ్స్ వేదికగా ఆడవాళ్లు ఏడవద్దు అనే భావనతో బాబ్ మార్లే పాడిన పాటకు అసలు అర్థాన్ని వివరించారు. అదేంటో ఆయన మాటల్లోనే విందాం..
"పటాయ్‌లో బీచ్ ఒడ్డున రెస్టారెంట్‌లో కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తి బాబ్ మార్లే పాటలు పాడుతున్నాడు. రెండు పాటల తర్వాత అతను 'నో విమెన్ నో క్రై' అనే పాటను మొదలుపెట్టాడు. ఆ పాట వింటూనే రెస్టారెంట్‌లోని మగవాళ్లంతా అరుపులు, విజిల్స్ వేయడం ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్‌లోని ఆడవాళ్లంతా మొహాలు చిన్నబుచ్చుకుని కూర్చున్నారు. సింగర్ 'నో విమెన్ నో క్రై' అన్నప్పుడల్లా రెస్టారెంట్‌లోని మగాళ్లు అతడితో గొంతు కలిపి, అంతకంటే పెద్దగా 'నో విమెన్ నో క్రై' అనడం ప్రారంభించారు. కానీ ఈ పాట అసలు భావం 'నో విమెన్ నో క్రై' కాదు, 'నో విమెన్ న క్రై'. అంటే ఆడవాళ్లు ఏడవద్దు అని అర్థం. చాలా మంది ఈ పాట బాబ్ మార్లే రాశాడనుకుంటారు. నిజానికి ఈ పాట రాసింది విన్సెంట్ ఫోర్డ్. విన్సెంట్ ఫోర్ట్ రాసిన లిరిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాబ్ మార్లే ఈ పాట పాడాడు"
"ట్రెంచ్ టౌన్‌లో ఒక బిడ్డను పోలీసులు కొడుతుంటే ఆ ఏడుపు నాకు వినిపిస్తుంది. ట్రెంచ్ టౌన్‌లో ప్రభుత్వ స్థలంలో కూర్చున్నప్పుడు మంచి వ్యక్తులను, స్నేహితులను కలవడం, రాత్రులు దీపాలు వెలిగించడం, కార్న్ మీల్‌తో పూరిట్జ్ వండుకోవడం నాకు గుర్తుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయాల వల్ల అలాంటి ఆహ్లాదరకరమైన వాతావరణాన్ని కోల్పోతున్నాం. త్వరలోనే మనకు మంచి రోజులొస్తాయి' అని విన్సెంట్ రాశాడు. దాని స్ఫూర్తితో బాబ్ మార్లే ఆడవాళ్లు మీరు ఏడవద్దు అంటూ ఆలపించాడు. కానీ ఈ పాటను మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. అసలు ఆడవాళ్లే లేకపోతే ఎలాంటి సమస్యలు ఉండవని అనుకుంటున్నాం. జమైకా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందరు ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్నారు. 'నో విమెన్ నో క్రై' అనే పదం మినహా పాటలోని మిగతా లిరిక్స్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. అలా ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లలో నేను కూడా ఉన్నాను. ఒకవేళ ఈ జాబితాలో నాతోపాటు మీరు కూడా ఉంటే ఇకపై పాట విన్నప్పుడు గోల చేయొద్దు. ఇది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాట నో విమెన్ న క్రై " అంటూ పూరి ముగించారు.
ఇదీ చూడండి: ఆనందంగా ఉండాలంటే ఇలా చేయండి: పూరీ జగన్నాథ్