ఇంట్లోనే చిన్నపిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు ముద్దుగా సిసింద్రీ అని పిలుచుకుంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న వారి కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేస్తే తల్లి మనసు ఎంత గాయపడుతుందో కదా. ఇదే కథాంశంతో 25 ఏళ్ల క్రితం తీసిన చిత్రం 'సిసింద్రీ'. దీనితోనే బాలనటుడిగా పరిచయమయ్యాడు అఖిల్ అక్కినేని. సిసింద్రీగా ఎంతటి మాయ చేశాడో మాటల్లో చెప్పలేం. ఆ వయసులో నటించాడో, జీవించాడో తెలియనంతగా అలరించాడు. ఇందులో అఖిల్ తల్లి దండ్రులుగా శరత్ బాబు, ఆమని నటన ఆకట్టుకుంటుంది. శరత్ తమ్ముడిగా శివాజీ రాజా ప్రతినాయక పాత్రలో కనిపించి రక్తి కట్టించారు.
కథేంటి?
అన్నయ్య మీద కోపంతో శివాజీ సిసింద్రీని కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక రచిస్తాడు. ఇందుకు అక్కన్న, మాదన్న, జక్కన్న (తనికెళ్ల భరణి, సుధాకర్, గిరిబాబు) సహాయం తీసుకుంటాడు. అలా అపహరించిన ఆ గ్యాంగ్‌ను సిసింద్రీ తన చిలిపి పనులతో ఆటాడుకుంటాడు. మరోవైపు కొడుకు కనిపించలేదనే బాధతో ఉంటారు శరత్, ఆమని. వీళ్లకు నాగార్జున తోడై సిసింద్రీని ఆ ముఠా నుంచి రక్షించి తల్లిదండ్రులకు అప్పగిస్తారు.
ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు తీసిన 'సిసింద్రీ'.. అప్పట్లో ఓ సంచలనం. ఇందులో నటించిన నటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజ్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకే ప్రధానంగా నిలుస్తుంది. ముఖ్యంగా 'చిన్ని తండ్రీ నిను చూడగా' అనే పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. అతిథి పాత్రలు పోషించిన టబు, పూజా.. సినిమాకు కొత్త కళ తీసుకొచ్చారు. బ్రహ్మానందం, ఏవీఎస్ కామెడీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.