గుట్కా అక్రమ రవాణా ఆరోపణలతో నటుడు సచిన్ జోషిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం క్రితం గుట్కా స్మగ్లింగ్ నేపథ్యంలో పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. వారి వద్ద నుంచి 80 బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సచిన్ జోషికి సమన్లు జారీ చేశారు. అయితే సచిన్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేశారు.
దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన సచిన్‌ను ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. 336, 273 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.
దుబాయ్‌కు చెందిన పారిశ్రామికవేత్త సచిన్.. 'మౌన మేలనోయి' చిత్రంతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అనంతరం 'ఓరేయ్ పండు', 'నీ జతగా నేనుండాలి' సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. 'నెక్ట్స్ ఏంటి' సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు.