కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడకూడదని ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది తమకు తెలిసిన ఇంటి చిట్కాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రత్యేకించి ఆహారం విషయంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంట్లో వండిన పదార్థాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అది కూడా పోషకాలు పుష్కలంగా లభించే వాటికే ఓటేస్తున్నారు. అలాంటి వారందరికీ తన మార్నింగ్ రొటీన్‌ని పరిచయం చేసింది బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో తాను పాటిస్తోన్న ఈ అలవాట్లతో అందంతో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటోంది. ఈ క్రమంలో తన రోజు మొదలయ్యే తీరు గురించి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
ఆ తీర్మానాన్ని సీరియస్‌గా తీసుకున్నాను!
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఈ ఏడాది ప్రారంభంలో నేను ఒక తీర్మానం పెట్టుకున్నాను. సమోసా, కచోరి, భటూరే, బిర్యానీ...తదితర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వీటిని తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలతో పాటు శరీరానికి ఒక రకమైన బద్ధకం ఆవరించినట్లు అనిపించింది. అందుకే నా రిజల్యూషన్‌ని సీరియస్‌గా తీసుకున్నాను. హెల్దీ డైట్‌లో భాగంగా కొన్ని రకాల జ్యూస్‌లను తాగడం అలవాటు చేసుకున్నాను. ఇందుకు సంబంధించి కొన్ని రకాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు చాలామంది నెటిజన్లు నా హెల్దీ సీక్రెట్స్ గురించి అడుగుతున్నారు? అందుకే నా బ్రేక్‌ఫాస్ట్ జ్యూస్‌తో పాటు ఉదయాన్నే లేవగానే నేను చేసే కొన్ని పనుల గురించి పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చాను.
-హీనా ఖాన్, బాలీవుడ్ నటి
నిమ్మరసం, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ!
‘ఉదయాన్నే నిద్ర లేవగానే మొదట కొద్ది సేపు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తాను. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగుతాను. ఇలా ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల యాసిడ్ లెవెల్స్ బ్యాలన్స్ అవుతాయి. కొద్ది సేపయ్యాక కప్పు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగుతాను. ఈ కాఫీతో శరీరంలోని జీవక్రియల రేటు బాగా మెరుగుపడుతుంది.
ప్రస్తుతం చాలామంది ఈ కాఫీ గురించే అడుగుతున్నారు. దీనిని ఎలా తయారుచేసుకోవాలంటే...
కావాల్సినవి...
- బ్లాక్ కాఫీ లేదా కాఫీ డికాక్షన్ - కప్పు
- నెయ్యి - టేబుల్‌స్పూన్
- కొబ్బరి నూనె - టేబుల్‌స్పూన్
- తేనె - తియ్యదనం కోసం
తయారీ
'ఈ పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి కాస్త నురుగొచ్చే వరకు మిక్సీ పట్టాలి. లేదంటే ఎలక్ట్రిక్ బ్లెండర్ సహాయంతో 30 సెకన్ల పాటు బ్లెండ్ చేసినా సరిపోతుంది. ఇలా తయారైన కాఫీని గాజు గ్లాస్‌లో లేదంటే కప్‌లో ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇక నా చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు టీట్రీ ఆయిల్‌తో కూడిన ఫేస్‌వాష్ క్రీమే కారణం. రోజూ దానితోనే ముఖం కడుక్కుంటాను. ఆ తర్వాత మాయిశ్చరైజర్ కోసం సీరమ్ ముఖానికి రాసుకుంటాను.'
బ్రేక్‌ఫాస్ట్‌గా బీట్ రూట్ బనానా జ్యూస్
ఇక నా డైలీ రొటీన్‌లో చాలా ముఖ్యమైనది బీట్‌రూట్ బనానా జ్యూస్. రోజూ దీన్నే నేను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. ఈ జ్యూసే నన్ను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి.
కావాల్సిన పదార్థాలు
- బీట్ రూట్-1
- అరటి పండు-1 (ఫ్రిజ్‌లో ఉంచినది)
- క్యారట్-1
- యాపిల్-1
- నీరు-అరకప్పు
- నానబెట్టిన సబ్జా గింజలు- 2 టేబుల్ స్పూన్లు (అధిక ఫైబర్ కోసం)
తయారీ
ముందుగా బీట్‌రూట్, ఫ్రిజ్‌లో ఉంచిన అరటి పండు, క్యారట్, యాపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వీటన్నింటితో పాటు అరకప్పు నీళ్లను మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు కలుపుకొంటే బీట్‌రూట్ బనానా జ్యూస్ రెడీ. ఫ్రిజ్‌లో ఉంచిన అరటి పండు వాడడం వల్ల జ్యూస్‌కు చిక్కదనంతో పాటు తియ్యదనం వస్తుంది. ఇక ఈ జ్యూస్ తాగిన 20 నిమిషాల తర్వాతే జిమ్‌కు వెళ్తాను. అనంతరం డ్యాన్స్ క్లాసులకు హాజరవుతా’ అని తన మార్నింగ్ రొటీన్ గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.
అందంతో పాటు ఆరోగ్యకరం!
హీనా ఉదయం నిద్ర లేవగానే తీసుకునే పదార్థాలన్నింటిలో బోలెడన్ని పోషక విలువలు దాగున్నాయి. అవేంటంటే...
- ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల యాసిడ్ లెవెల్స్ బ్యాలన్స్ అవుతాయి. నిమ్మరసంలో అధికంగా ఉండే సి-విటమిన్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పలు బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం, అజీర్తి, ఎసిడిటీ లాంటి సమస్యలు దూరమవుతాయి. మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది.
- ఇక బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదా బటర్ కాఫీని పరగడుపున తీసుకుంటే బరువు తగ్గచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరానికి తక్షణ శక్తి అందుతుందట. యాక్టివ్‌గా వ్యాయామాలు, వర్కౌట్లు చేయచ్చు. ఈ కాఫీ తాగడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతులంగా ఉండి మూడ్ స్వింగ్స్‌ని దూరం చేస్తాయంటున్నారు నిపుణులు.
- నెయ్యిలోని లినోలిక్ ఆమ్లం జీర్ణక్రియలను వేగవంతం చేసి.. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులోని కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి నరాలను ఉత్తేజితం చేస్తాయి.
- పొక్కులు, పింపుల్స్, మచ్చలకు సహజసిద్ధమైన మందులా పనిచేస్తుంది టీట్రీ ఆయిల్. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గించి నిగారింపు సంతరించుకునేలా చేస్తుంది. ఈ నూనెతో స్ట్రెచ్ మార్క్స్‌ని కూడా దూరం చేసుకోవచ్చు.
- ఇక బీట్‌రూట్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వులు అసలు ఉండవు. కాబట్టి నాజూగ్గా తయారవ్వాలనుకునే వారు దీన్ని తరచూ తీసుకోవడం ఉత్తమం. దీన్ని రసం రూపంలో తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య పెరగడమే కాకుండా రక్త హీనత లాంటి సమస్యలు దూరమవుతాయి.
- ఎ- విటమిన్ పుష్కలంగా దొరికే క్యారట్లు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. నల్లమచ్చలు, ముడతలు, మొటిమలు...లాంటి సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి. ఇక క్యారట్‌తో కంటికి కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
- అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే యాపిల్‌లో సి, బి, కె విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అజీర్తి సమస్యలను దూరం చేస్తాయి. జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తాయి.
- సబ్జా గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లూటెన్ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, తదితర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మరి మీరు కూడా వీటిని అలవాటు చేసుకుని రోజును ప్రారంభించండి. అందంతో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
ఇదీ చదవండి: గోవాలో 'ఇఫి' వేడుకలు.. ప్రముఖుల సందడి