Remove Search Results From Google : ఒక్కోసారి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో మన వ్యక్తిగత సమాచారం కనిపిస్తుంటుంది. ఇందులో మన పేరు, ఇంటి అడ్రస్, మొబైల్ నంబర్, పర్సనల్ మెయిల్ ఐడీ, ఫొటోలు లాంటివి ఉండవచ్చు. అయితే ఇలా బహిరంగంగా మన వ్యక్తిగత వివరాలను అందరికీ కనిపించేలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు టెక్ నిపుణులు. వీలైతే వాటిని ఎవరికీ కనిపించకుండా లేదా అందుబాటులో లేకుండా చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే ఇవి ఎప్పటికీ కనిపించకుండా సెర్చ్ రిజల్ట్స్ నుంచి పూర్తిగా తొలగించవచ్చా? అనే ప్రశ్నకు సమాధానమే ఈ ఆర్టికల్.
గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో మన పర్సనల్ ఇన్ఫోను తొలగించుకునే పరిష్కారం ఇదివరకే ఉన్నా.. అది పూర్తిగా తొలగిపోతుందో? లేదో? చెప్పలేని పరిస్థితి ఉండేది. అయితే తాజాగా గూగుల్ తెచ్చిన ఓ సరికొత్త టూల్ ( Search Results Chrome )తో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఈ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రానప్పటికీ.. భవిష్యత్తులో ఇది అందరికీ ఉపయోగపడవచ్చని అంచనా వేస్తున్నారు.
సెర్చ్ బార్లో పబ్లిక్‌గా కనిపించే మన వ్యక్తిగత వివరాలను కొందరు కేటుగాళ్లు సేకరించి మోసాలకూ పాల్పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు సైబర్ నిపుణులు. దీనిని అరికట్టడంలో భాగంగానే వినియోగదారుల భద్రత కోసం గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త టూల్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తెెస్తూ వస్తోంది. ఇవి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన రిజల్ట్స్‌ను పూర్తిగా డిలీట్ చేయడంలో సహాయపడతాయి. వీటి సాయంతో మన వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాలం నుంచి సులువుగా తొలగించుకోవచ్చు ( How To Remove Google Search Results ). 2022లో కూడా గూగుల్ ఈ సెర్చ్ రిజల్ట్స్ వ్యూ నియంత్రణకు సంబంధించి ప్రత్యేకంగా ఓ టూల్‌ను తీసుకువచ్చింది. ఇది మన వ్యక్తిగత సమాచారానికి భద్రతను కల్పిస్తుంది.
Search Results Google : గతేడాది తెచ్చిన టూల్‌ను మరింత మెరుగ్గా అప్‌గ్రేడ్ చేసింది గూగుల్. దీనిని తాజాగా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌కు అనుసంధానించారు. దీనితో రిజల్ట్స్‌లో మీ వ్యక్తిగత వివరాలు ఇతర వ్యక్తులకు ఎప్పటికీ కనిపించకుండా చేయవచ్చు. పైగా మీ పర్సనల్ వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యక్తిగత వివరాలు బహిరంగంగా సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించగానే మీకు పలు అలర్ట్‌లను కూడా పంపిస్తుంది ఈ నయా టూల్. అయితే దీనిని మీరు ఉపయోగించాలంటే.. కచ్చితంగా మీకు గూగుల్ అకౌంట్ ఉండాలి.
సెర్చ్ రిజల్ట్స్ డిలీట్ ఇలా..
- ముందుగా బ్రౌజర్లో గూగుల్‌ను ఓపెన్ చేయండి.
- సెర్చ్బార్లో మీ పేరు, ఇంటి చిరునామా లాంటి వ్యక్తిగత వివరాలను సెర్చ్ చేయండి.
- అప్పుడు మీకు సంబంధించిన కొన్ని సైట్స్ లేదా వివరాలు డిస్ప్లే అవుతాయి.
- అనంతరం మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ రిజల్ట్ పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
- తరువాత కనబడే ఆప్షన్స్ మెనూ నుంచి 'రిమూవ్ రిజల్ట్‌ను' సెలెక్ట్ చేయండి.
- అయితే మీరు ఆ రిజల్ట్‌ను ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారు అని గూగుల్ మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు అందుకు గల కారణాన్ని తెలియజేసే ఐదు ఆప్షన్స్‌లలో డిలీట్కి గల కారణం ఉన్న ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- మీరు ఎంచుకున్న ఎంపిక ఆధారంగా మీరు అక్కడ కనిపించే ఇతర సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
- అలా గూగుల్ చెప్పే సూచనలను అనుసరించి మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ రిజల్ట్‌ను సులువుగా తొలగించవచ్చు.
Search Remove Results : మీరు చేసే ఈ తొలగింపు అభ్యర్థనను గూగుల్ సెటప్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. అలా మీరు చేసిన అభ్యర్థన అప్రూవ్ అయిందా లేదా తిరస్కరణకు గురైందా అనేది కూడా మీ డాష్‌బోర్డ్‌లో తెలిసిపోతుంది. అయితే దీనికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు. మరోవైపు మీ అభ్యర్థనను గూగుల్ ఆమోదిస్తుందనే గ్యారెంటీ కూడా ఉండదు.
ఈ సెర్చ్ రిజల్ట్ డిలీట్ టూల్‌కు సంబంధించి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అవేంటంటే..
- ఈ టూల్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన రిజల్ట్స్‌ను మాత్రమే తొలగిస్తుంది. కానీ అప్పటికే ఎంట్రీ చేసి ఉన్న మీ వివరాలను మాత్రం అలానే ఉంచుతుంది.
- మీరు ఒరిజినల్ వెబ్‌సైట్‌ను లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లి వెతికినా అప్పటికే ఎంటర్ చేసి ఉన్న సెర్చ్ రిజల్ట్స్ మళ్లీ కనిపిస్తుంటాయి.
- దీనిని మీరు పూర్తిగా డివైజ్ నుంచి తొలగించాలనుకుంటే సంబంధిత వెబ్సైట్ ఓనర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
- ప్రస్తుతానికి ఈ టూల్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. పైగా ఇంగ్లిష్‌లోనే దీనిని రూపొందించారు. అయినప్పటికీ VPN సాయంతో ఈ ఫీచర్‌ను ఇతర దేశాల్లోనూ పరీక్షించగలుగుతున్నారు.
- మీరు తొలగించాలని కోరే ప్రతి రిజల్ట్‌ను గూగుల్ వ్యక్తిగతంగా సమీక్షిస్తుంది. అంతే కాకుండా మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ రిజల్ట్స్ ఎంట్రీలు సంస్థ నిర్దేశించిన పాలసీ నిబంధనలను ఉల్లంఘించాయా? లేదా? అనేది కూడా చెక్ చేస్తుంది.
- ఒకవేళ వెబ్సైట్ ఓనర్ ఇచ్చిన కీ-వర్డ్ లేదా సెర్చ్ రిజల్ట్ కంపెనీ నియమాలకు అనుగుణంగా ఉంటే గనుక.. మీరు తీసేయమని కోరే రిజల్ట్‌ను డిలీట్ చేయదు. అంటే మీ అభ్యర్థనను తిరస్కరిస్తుంది.
మొత్తంగా గూగుల్ ప్రవేశపెట్టిన ఈ టూల్స్ గనుక భవిష్యత్తులో అందిరికీ అందుబాటులోకి వస్తే.. సెర్చ్ రిజల్ట్స్‌ను సులువుగా తొలగించుకోవచ్చు.