ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం సరికొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇకపై పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా.. 'యూపీఐ లైట్' అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూపీఐ ద్వారా డబ్బును పంపించటం, స్వీకరించే ప్రక్రియలను సులభతరం చేసేందుకు ఈ యూపీఐ లైట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ పేటీఎం 'యూపీఐ లైట్' ద్వారా తక్కువ మొత్తంలో లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. పేటీఎం యాప్ ద్వారా యూపీఐ పిన్ను వినియోగించే అవసరం లేకుండా ఒక క్లిక్‌తో ఇకపై రూ.200 వరకు చిన్నమొత్తంలో లావాదేవీలను వేగంగా చేసుకోవచ్చు.
ఈ ఆవిష్కరణతో యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి సంస్థగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పేరొందింది. రూ.2,000 వరకు యాడ్ చేసుకోవటం ద్వారా రోజుకు రెండుసార్లు యూపీఐ వ్యాలెట్‌కు రీఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తంగా దీని రోజువారీ పరిమితి రూ.4,000 ఉంటుంది. బ్యాంక్స్ పరిమితిని పట్టించుకోకుండా యూపీఐ లైట్‌ను ఉపయోగించి అనేక లావాదేవీలను చేసుకోవచ్చు.
" ఈ యూపీఐ లైట్‌ను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాం. ఎన్పీసీఐ అధికారిక డేటా ప్రకారం, దేశంలో ప్రతిరోజు జరిగే యూపీఐ లావాదేవీల్లో రూ.200 కంటే తక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలే సగం ఉన్నాయి. యూపీఐ లైట్ ఫీచర్‌తో యూజర్స్ ఇకపై వేగంగా తక్కువ మొత్తంలో లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చు. డిజిటల్ ఇన్‌క్లూజన్‌ను నడపడంపై మేము దృష్టిసారించాము. ఆ మార్గంలో సాగేందుకు యూపీఐ లైట్ ప్రారంభం పెద్ద స్టెప్."
--సురీందర్ చావ్లా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ
ఎన్సీపీఐ, ఆర్బీఐ సంస్థలు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు ఈ 'యూపీఐ లైట్' ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇకపై చిన్నమొత్తంలో చేసే లావాదేవీలు పేటీఎం బ్యాలెన్స్, హిస్టరీ సెక్షన్లో మాత్రమే కన్పిస్తాయని.. బ్యాంక్ పాస్‌బుక్‌లో కనిపించవని వెల్లడించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. తమ యూజర్లకు ఏ రిజిస్టర్డ్ యూపీఐ మొబైల్ నంబర్‌కైనా పేటీఎం యాప్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని ఇటీవల తీసుకొచ్చింది.