WhatsApp Scams and Online Scams : వాట్సాప్ నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యమైన సమాచారాన్ని చిటికెలో అందించడానికి, తెలుసుకోవడానికి ఇది గొప్ప వేదిక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఇదే ఇప్పుడు స్కామ్‌లకు, మోసపూరిత కార్యక్రమాలకు అడ్డాగా మారింది.
భారతదేశంలో వాట్సాప్‌కు అతిపెద్ద యూజర్ బేస్ ఉంది. అందుకే ఆన్లైన్ మోసగాళ్లు, సైబర్ నేరగాళ్లు దీనిపై కన్నేశారు. వీరు చేసే స్కామ్‌లు చాలా రూపాల్లో ఉంటాయి. ముఖ్యంగా వీరి వలలో చిక్కుకున్నవారిని ఆర్థికంగా దోపిడీ చేస్తారు. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. మరీ ఘోరంగా బాధితుల ఐడెంటీని కూడా తస్కరిస్తారు.
నమ్మించి.. మోసం చేస్తారు!
WhatsApp scam messages : స్కామర్లు మంచి పేరున్న సంస్థలు, వ్యక్తుల పేర్లతో స్కామ్‌లకు పాల్పడుతుంటారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని లేదా సులువైన మార్గాల్లో బాగా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపిస్తారు. కొన్ని సార్లు ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతుల పేరిట వల విసురుతారు. పొరపాటున వీటి ట్రాప్‌లో పడ్డామా.. ఇక అంతే! మన జేబుకు చిల్లుపడినట్లే. వాస్తవానికి ఈ నేరగాళ్లు ఎంతగా తెలివిమీరిపోయారంటే.. వీరి నుంచి వచ్చే మెసేజ్‌లు నిజమైనవా? లేదా నకిలీవా? అని కనిపెట్టడం కూడా చాలా కష్టం.
2023లో జరిగిన వాట్సాప్ స్కామ్‌లు
వీడియో కాల్ స్కామ్ :
WhatsApp Video Call Scams : స్కామర్లు అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిల ప్రొఫైల్ పిక్చర్స్‌తో.. తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు వీడియో కాల్ చేస్తారు. పొరపాటున వాటిని లిఫ్ట్ చేస్తే, మంచిగా మాటల్లోకి దింపి, మిమ్మల్ని ఆకర్షించే విధంగా న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తారు. కొన్ని సార్లు న్యూడ్ కాల్స్ చేసేందుకు ప్రోత్సహిస్తారు. అమాయకంగా వారి వలలో పడిన వెంటనే.. దానిని జాగ్రత్తగా రికార్డ్ చేస్తారు. ఇక అప్పటి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ, బెదిరిస్తారు. ఇవ్వనంటే, ఆ వీడియోలను బంధువులకు, స్నేహితులకు చూపిస్తామని హెచ్చరిస్తారు. మీరు భయపడి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తరువాత, ఇక ప్రతిసారీ మిమ్మల్ని ఆర్థికంగా పీడిస్తూనే ఉంటారు. కనుక ఇలాంటి కాల్స్ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
లాటరీ స్కామ్స్ :
Lottery Scams in India : సైబర్ నేరగాళ్లు లాటరీ ప్రైజ్ మనీ పేరుతో ఫ్రాడ్స్ చేస్తుంటారు. ముఖ్యంగా లాటరీలో భారీ మొత్తం సొమ్మును గెలుచుకున్నారంటూ.. వ్యక్తులకు ఈ-మెయిల్స్, ఫొటోస్ లేదా వీడియోస్ పంపిస్తారు. ఎవరైనా పొరపాటున వీటిని నమ్మితే.. ఒక ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌కు కాల్ చేసి లాటరీ డబ్బులు గురించి మాట్లాడమని నమ్మకంగా చెబుతారు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే, గెలిచిన డబ్బు పంపించడానికిగాను కొంత సొమ్మను సెక్యూరిటీగా కట్టవలసి ఉంటుందని, అయితే దానిని కూడా రిఫండ్ చేస్తామని నమ్మిస్తారు. ఇది మోసమని తెలియక చాలా మంది ఇలా డబ్బులు పంపించి, భారీగా నష్టపోతున్నారు. ఈ విషయంలో తస్మాత్త్ జాగ్రత్త.
క్రిప్టో స్కామ్స్
Crypto Scams : సైబర్ క్రిమినల్స్ ప్రధానంగా విద్యావంతులను క్రిప్టో స్కామ్స్‌కు బలిచేస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే, చాలా పెద్ద మొత్తంలో సంపాందించవచ్చని నమ్మిస్తారు. దీనిని నమ్మి డిజిటల్, క్రిప్టో కరెన్సీలలో ఇన్వెస్ట్ చేస్తే, మోసపోవడం ఖాయం.
వాట్సాప్ క్యూఆర్ కోడ్
QR Code Scams 2023 : సైబర్ నేరగాళ్లు.. వ్యక్తులకు క్యాష్ ప్రైజ్ వచ్చిందని నమ్మిస్తూ, క్యూఆర్ కోడ్లను పంపిస్తారు. పొరపాటున ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేశారో.. మీ బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది.
స్కామ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి?
How to Protect from online scams : ఆన్లైన్ స్కామ్స్, వాట్సాప్ స్కామ్స్ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లను, ఈ-మెయిల్లను, వాటి అటాచ్మెంట్లను క్లిక్ చేయకపోవడం మంచిది. తెలియని వ్యక్తులు.. మన వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అర్జెంట్‌గా డబ్బులు కావాలి అంటూ ప్రాధేయపడుతూ వచ్చే మెసేజ్‌లను ఇగ్నోర్ చేయడం ఉత్తమం.
ఒక వేళ మీకు వచ్చిన మెసేజ్ లేదా ఈ మెయిల్లో ఇంగ్లీష్ పదాలు, గ్రామర్ తప్పుగా ఉండే.. కచ్చితంగా అది స్కామర్స్ పనే అని గుర్తించాలి. మీరు ఎప్పుడూ పార్టిసిపేట్ చేయని లాటరీలో.. మీకు బహుమతి వచ్చిందని మెసేజ్ వస్తే.. దానిని కచ్చితంగా స్కామ్‌గా గుర్తించండి. ఒక వేళ మీరు కచ్చితంగా డబ్బులు పంపించాల్సి వస్తే.. అవతలి వ్యక్తి పూర్తి సమాచారాన్ని వెరిఫై చేసుకొని మాత్రమే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేయండి.