Sankranti Special Spicy Recipes: సంక్రాంతి పండగ అంటే.. అందమైన రంగవల్లులు, అందులో అందంగా కొలువుతీరిన గొబ్బెమ్మలు, భోగి మంటలు, భోగి పళ్లు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, పిండి వంటల ఘుమఘుమలు.. ఇలా ఒకటేమిటి ఆ మూడు రోజులు వేరే లెవల్ అన్నట్లుగా ఉంటుంది. ఇక మహిళలైతే.. పండక్కి వచ్చే కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్ల కోసం వారం రోజుల ముందే నుంచే పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. ఈ క్రమంలో సంక్రాంతికి ఎంతో ఫేమస్ అయినా సకినాలు, జంతికలు, చెక్క గారెలు ఎలా చేయాలి..? వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
సకినాలు: పండగ ఏదైనా, ఫంక్షన్ ఏదైనా.. తెలుగు వారి ఇళ్లల్లో కనిపించేవి సకినాలు. ముఖ్యంగా మకర సంక్రాంతి పండుగ సమయంలో సకినాలు తయారుచేయడం ఒక ఆచారంగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
- కొత్త బియ్యం– కిలో
- వాము– రెండు టేబుల్ స్పూన్లు
- నువ్వులు- అర కప్పు
- వెన్న లేదా నెయ్యి- 2 టీస్పూన్లు
- ఉప్పు– రుచికి తగినంత,
- నూనె– వేయించడానికి తగినంత.
తయారీ:
- బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని వంపేసి.. ఓ క్లాత్ పరిచి దాని మీద ఈ బియ్యం వేసుకుని ఓ 15 నిమిషాలు ఆరనివ్వాలి.
- తర్వాత మెత్తగా పిండి పట్టాలి. ఇప్పుడు పిండిని జల్లించిన తర్వాత ఆ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు, నెయ్యి లేదా వెన్న వేసి కలపాలి.
- ఈ పొడి మిశ్రమంలో తగినంత నీటిని పోస్తూ ముద్దలా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఓ కాటన్ క్లాత్‌ను తడిపి పలుచగా పరిచి.. కలిపిన పిండిని కొద్దికొద్దిగా తీసుకుని.. ఆ క్లాత్ మీద సకినాల ఆకారంలో చేత్తో చుట్టూ అల్లాలి. అలా పిండి మొత్తం చేసుకోవాలి.
- తర్వాత సకినాలను పది నిమిషాల సేపు ఆరనివ్వాలి.
- ఈ లోపు బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆరిన సకినాన్ని నూనెలో వేసి రెండు వైపులా దోరగా కాలనిచ్చి తీసేయాలి.
- పిండిని చేతిలోకి తీసుకుని వేళ్లతో సన్నని తాడుగా వలయాకారంగా చేయడానికి నైపుణ్యం ఉండాలి. ఒకవేళ అలా చేయడం రాకపోతే.. జంతికలు తయారు చేసే గొట్టంలో స్టార్ గుర్తు ఉన్న బిళ్లను వేసి.. లోపల కొద్దిగా నూనె రాసి పిండి ముద్దను ఉంచి సకినాల షేప్‌లో ఒత్తుకోవాలి.
జంతికలు: మనం వంటింట్లో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో జంతికలు కూడా ఒకటి. వీటిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. జంతికల తయారీ విధానం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొన్ని సార్లు మనం తయారు చేసే ఈ జంతికలు గట్టిగా అవుతాయి లేదా మెత్తగా అవుతాయి. ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా కరకరలాడుతూ ఉండేలా చేయలేని వారు కూడా ఉంటారు. ఈ జంతికలను రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం పిండి – 2 కప్పులు,
- శనగపిండి – ఒక కప్పు,
- వాము – ఒక టేబుల్ స్పూన్
- కారం – 2 టీ స్పూన్స్
- ఉప్పు – తగినంత
- వంటసోడా – పావు టీ స్పూన్
- వెన్న – 2 టేబుల్ స్పూన్స్
- గోరు వెచ్చని నీళ్లు- తగినన్ని
- నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
జంతికల తయారీ విధానం..
- ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని, శనగ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోనే కారం, వాము, ఉప్పు, వంటసోడా వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తరువాత వెన్నను వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా, మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై తడి వస్త్రాన్ని ఉంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
- తరువాత కళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి.
- తరువాత జంతికల అచ్చును తీసుకుని దానికి లోపల పిండి అతుక్కుపోకుండా నూనెను రాయాలి.
- తరువాత ఇందులో తగినంత పిండిని ఉంచి జంతికలను నేరుగా నూనెలో ఒత్తుకోవాలి. నేరుగా నూనెలో జంతికలను ఒత్తడం రాని వారు ఒక ప్లేట్‌కు నూనె రాసి దాని పై జంతికలను ఓత్తుకుని నూనెలో వేసుకోవాలి.
- ఈ జంతికలను మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా అయ్యే వరకు రెండు వైపులా కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే జంతికలు తయారవుతాయి.
చిట్కా: జంతికలను ఎక్కువ సమయం నూనెలో ఉంచితే అవి గట్టిగా తయారవుతాయి. కనుక అవి రంగు మారగానే నూనె నుండి బయటకు తీయాలి. అలాగే జంతికలు మరీ లావుగా ఉన్నా కూడా మెత్తగా ఉంటాయి. కనుక జంతికలు మరీ లావుగా లేకుండా చూసుకోవాలి.
చెక్క గారెలు: వీటిని కూడా సంక్రాంతికి విరివిరిగా చేసుకుంటారు. క్రిస్పీగా, స్పైసీగా ఉండే వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- పొడి బియ్యం పిండి – రెండున్నర గ్లాసులు,
- నీళ్లు– తగిన్నన్ని,
- ఉప్పు – తగినంత,
- కారం – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచికి తగినంత
- జీలకర్ర – రెండు టీ స్పూన్స్
- తరిగిన కరివేపాకు – గుప్పెడు
- నానబెట్టిన శనగపప్పు – మూడు స్పూన్లు
- వేరుశనగలు- 100 గ్రాములు(వేయించి పొడి చేసుకోవాలి)
తయారీ విధానం:
- ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో బియ్యంపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, వేరుశనగల పొడి వేసుకుని కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మృదువుగా కలుపుకోవాలి.
- తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత పాలిథిన్ కవర్‌పై నూనె రాసి పిండి ఉండను ఉంచి చేత్తో అప్పడాల మాదిరిహా ఓత్తుకోవాలి. చేత్తో ఓత్తుకోవడం రాని వారు పూరీ ప్రెస్‌తో కూడా వీటిని ఒత్తుకోవచ్చు.
- ఇప్పుడు స్టౌ మీద నూనె పెట్టి వేడెక్కాక.. ఒత్తుకున్న చెక్క అప్పడాలను వేసి కాల్చుకోవాలి.
- వీటిని మీడియం మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, గుల్లగుల్లగా ఉండే చెక్క అప్పడాలు తయారవుతాయి.