ETV Bharat / opinion

మత్తు మాయలో యువత- మాఫియా గుప్పిట్లోకి రాష్ట్రాలు! - డ్రగ్స్​ మాఫియా

మాదక ద్రవ్య మాఫియా గుప్పిట్లోకి పలు రాష్ట్రాలు జారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న మాదకశక్తుల ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో వ్యవస్థాగత వైఫల్యం వల్ల దారుణ దుష్పరిణామాలు పెచ్చరిల్లుతున్నాయి. యువత మత్తుమందుకు బానిసలైతే దేశార్థికానికీ తీరని నష్టం కలుగుతుంది. యావత్‌ సమాజం మత్తుమందు వ్యసనానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

drug mafia
drug mafia
author img

By

Published : Jan 10, 2022, 7:32 AM IST

కొలంబియా, మెక్సికోవంటి లాటిన్‌ అమెరికా దేశాల పంథాలో భారత్‌లోనూ కొన్ని రాష్ట్రాలు మాదకద్రవ్య మాఫియా గుప్పిట్లోకి జారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంటను ధ్వంసం చేయడానికి వెళ్లిన ఎక్సైజు సిబ్బందిపై కొందరు దుండగులు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు- ముంచుకొస్తున్న ముప్పునకు సంకేతాలు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. గంజాయి పంట నిర్మూలనకు ఏపీ పోలీసులు నిరుడు అక్టోబరు 30న 'ఆపరేషన్‌ పరివర్తన' పేరిట భారీ కార్యక్రమం చేపట్టారు.

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో 253 గ్రామాల పరిధిలో 7,000 ఎకరాల్లో పండుతున్న గంజాయి పంటలో 90శాతం ధ్వంసం చేశామని పోలీసులు ప్రకటించారు. దాని మార్కెట్‌ ధర రూ.8,626 కోట్లని తెలిపారు. 546 మందిని అరెస్టు చేసి 214 కేసులు పెట్టామని, 100 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గంజాయి సాగు నిర్మూలనకు రాష్ట్ర పోలీసు శాఖ 2020లో ఏర్పరచిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇంతవరకు మూడు లక్షల కిలోల గంజాయిని పట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే... అమెరికా, పరాగ్వే, కొలంబియాల తరవాత అత్యధిక పరిమాణంలో గంజాయి పట్టుబడింది భారతదేశంలోనే. రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో లైసెన్సు మీద నల్లమందు సాగు జరుగుతోంది. నల్లమందు నుంచి వైద్య అవసరాల కోసం మార్ఫిన్‌ తదితర ఉత్పత్తులను తయారు చేస్తారు. అయితే, ప్రభుత్వం క్రమంగా నల్లమందు విస్తీర్ణాన్ని తగ్గిస్తోంది.

భయంకరమైన సమస్య

ఏదైనా దేశం ఒకసారి మాదక ద్రవ్య మాఫియా గుప్పిట్లో చిక్కిందంటే ఇక దానికి విముక్తి ఉండదని 1980ల నుంచి లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం నిరూపిస్తోంది. మాదక ద్రవ్య ఉత్పత్తి, దొంగరవాణా వందల కోట్ల డాలర్ల వ్యాపారంగా విజృంభిస్తుంది. మాఫియా ముఠాల మధ్య ఆధిపత్య పోరు ముమ్మరించి హత్యలు, అపహరణలు, డబ్బు గుంజడంవంటి నేరాలు పేట్రేగిపోతాయి. మాదక ద్రవ్య ముఠాలను కార్టెల్స్‌ అంటారు. అవి తమకున్న అపార ధనబలంతో- స్వార్థపరులైన కొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వ సిబ్బందిని కొనేస్తాయి. ఎదురు తిరిగేవారిని హతమారుస్తాయి. వాటి మారణ హోమంలో వందలాది అమాయక పౌరులూ బలైపోతారు.అవినీతి ఊడలు దిగి ప్రభుత్వాలు నిర్వీర్యమైపోతాయి.

మాదక ద్రవ్య ముఠాలు మామూలు వ్యాపారాలను, కంపెనీలను వశపరచుకుని అక్రమ ధనాన్ని సక్రమ ధనంగా చలామణీ చేస్తాయి. మత్తుమందు రాజ్యంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలన్నీ భ్రష్టుపట్టిపోతాయి. మత్తుమందు కార్టెల్స్‌ పరస్పర హననానికి దిగడంతో గూండాగిరీ, హత్యలు, బాంబు దాడులు పెచ్చరిల్లుతాయి. హెరాయిన్‌ వంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు; సింథటిక్‌ మాదకద్రవ్యాలు, ట్రాంక్విలైజర్లు, నిద్ర మాత్రలు, సాల్వెంట్లు, ముక్కుతో పీల్చే ఇన్‌హేలర్లు ప్రపంచ మాదక ద్రవ్యవ్యాపారంలో ప్రధాన అంతర్భాగాలు. 2019లో ప్రపంచంలో 15-64 వయోవర్గంలో 5.5శాతం ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని వినియోగించినవారేనని ఐక్యరాజ్యసమితి 2021లో వెలువరించిన ప్రపంచ మాదకద్రవ్య నివేదిక వెల్లడించింది. భారత్‌ తదితర అల్పాదాయ దేశాల్లో మత్తుమందు వినియోగం నానాటికీ పెరుగుతోందని తెలిపింది. 2019లో ప్రపంచంలో 20 కోట్లమంది గంజాయిని, రెండు కోట్లమంది కొకైన్‌ను, 6.2 కోట్ల మంది హెరాయిన్‌ను వినియోగించారు. ఈ మాదకద్రవ్యాలకు ప్రధాన మార్కెట్లు అమెరికా, ఐరోపాలే.

పరిష్కారాలేమిటి?

గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకు మాదకద్రవ్య ముఠాలు వలవేసి గంజాయి, నల్లమందు ఉత్పత్తిలోకి దించుతుంటాయి. భారత్‌లో కనీసం ఎనిమిది రాష్ట్రాలు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక్కడి రైతాంగం మాదక ద్రవ్య సాగుకు మళ్ళకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలి. వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపడంపై చూపుతున్న శ్రద్ధ, కేటాయిస్తున్న ఆర్థిక, మానవ వనరులను మాదకద్రవ్య సాగు, దొంగరవాణాలను అడ్డుకోవడానికి వినియోగించాలి. మెక్సికో, కొలంబియాలలో రైతులకు మాదక ద్రవ్య సాగు వల్ల మొదట్లో కాస్త లాభం కనిపించినా, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఆ కాస్త ప్రయోజనం ఆవిరైపోతోంది. మాదకద్రవ్య ముఠాలే వందల కోట్ల డాలర్ల లాభాలను కళ్లచూస్తాయి. రైతులు ఒకసారి ఈ ముఠాల కబంధ హస్తాల్లో చిక్కారంటే- ఎప్పటికీ బయటపడలేరు. మరోవైపు సమాజంలో మత్తు పదార్థాల అలవాటు పెరిగినప్పుడు అనారోగ్య సమస్యలూ మిన్నంటుతాయి. ప్రభుత్వాలకు, వ్యక్తులకు చికిత్స ఖర్చులు అలవికానంతగా పెరిగిపోతాయి. హెరాయిన్‌, నల్లమందు వాడకం వల్ల ఏటా 1.29 కోట్ల అకాల మరణాలు సంభవిస్తున్నాయి. కాలేయ క్యాన్సర్‌, సిరోసిస్‌, హెపటైటిస్‌ సి, ఎయిడ్స్‌ వంటి వ్యాధులూ పెచ్చరిల్లుతాయి. యువత మత్తుమందుకు బానిసలైతే దేశార్థికానికీ తీరని నష్టం కలుగుతుంది. యావత్‌ సమాజం మత్తుమందు వ్యసనానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా మేల్కొని మాదకద్రవ్య భూతంపై అలుపెరుగని పోరు సాగించాలి.

అక్రమార్కుల ఉచ్చులో రైతులు

కొలంబియా, మెక్సికోలలో 1970, 80లలో నిరుద్యోగం, గిట్టుబాటుకాని వ్యవసాయం- రైతులను, యువతను మాదకద్రవ్య ఉత్పత్తి, దొంగ రవాణాలోకి నెట్టాయి. రాజకీయ నాయకులు, నేరగాళ్లు రైతులను ప్రలోభపెట్టి మాదక ద్రవ్య సాగులోకి దించారు. కానీ, చివరకు రైతులకు ముట్టేది నామమాత్రమే. వందల కోట్ల డాలర్ల లాభాలు మాదక ద్రవ్య కార్టెల్స్‌ చేతుల్లోకి, రాజకీయ నాయకుల జేబుల్లోకి చేరిపోతాయి. కొవిడ్‌ కాలంలో దిక్కుతోచని రైతులు, యువత మాదకద్రవ్య ఊబిలో మరింతగా కూరుకుపోతున్నారు. కొలంబియాలో మాదకద్రవ్య కార్టెల్స్‌ను రూపుమాపడానికి అక్కడి ప్రభుత్వం అమెరికా వత్తాసుతో వందల కోట్ల డాలర్లు ధారపోసి- పోలీసు, సైనిక బలగాలను మోహరించినా ఫలితం లేకపోయింది. కొలంబియాలో 2010లో లక్ష ఎకరాల్లో 329 టన్నుల కొకైన్‌ ఉత్పత్తి అయింది. 2020కల్లా అది 2.45 లక్షల ఎకరాలకు, 1,010 టన్నుల ఉత్పత్తికి పెరిగిపోయింది. పెరూ, బొలీవియా, మెక్సికో దేశాల పరిస్థితీ ఇదే. 2020లో ప్రపంచమంతటా 1,784 టన్నుల కొకైన్‌ ఉత్పత్తి అయింది. నల్లమందు ఉత్పత్తిలో 37శాతం ఒక్క అఫ్గానిస్థాన్‌లోనే జరుగుతోంది. అఫ్గానిస్థాన్‌ నుంచి భారతదేశంలోకి నల్లమందు, హెరాయిన్‌ దొంగరవాణా ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెక్సికో, మయన్మార్‌లలోనూ నల్లమందు ఉత్పత్తి అవుతోంది. నల్లమందు నుంచి హెరాయిన్‌, మార్ఫిన్‌ తదితర మత్తుమందులు తయారవుతాయి. 2020లో ప్రపంచమంతటా 7,410 టన్నుల నల్లమందు ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు విస్తరణను ఆదిలోనే నిర్మూలించకపోతే లాటిన్‌ అమెరికా దేశాల భయానక అనుభవం ఇక్కడా పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.

రచయిత- ఎస్​ అనంత్​, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు

ఇదీ చూడండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. మోదీ ఫొటో లేకుండానే వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.