Sri Lanka reserves: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతున్న వేళ.. కీలకమైన పార్లమెంటు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సపైనా, ఆయన ప్రభుత్వంపైనా ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన అనంతరం నిర్వహించిన సమావేశం ఇది. ఈ సందర్భంగా ద్వీపదేశ సంక్షోభాన్ని ఆర్థిక మంత్రి అలీ సబ్రీ కళ్లకు కట్టారు. ప్రధాన ప్రతిపక్షం సమాగీ జన బలవేగయ (ఎస్‌జేబీ) పార్టీ.. స్పీకర్ మహింద యాపా అబేయవర్దనేకి రెండు తీర్మానాలను అందజేసింది. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు నిర్ణయించడానికి వారం రోజుల ముందు తీర్మానంపై నోటీసు ఇవ్వాలి. తాజా అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఓటింగ్ తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉంది. వీటిని పరిశీలించడానికి పార్లమెంటు సన్నద్ధమవుతుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలనే ప్రతిపాదనపై క్యాబినెట్ ఉపసంఘాన్ని నియమించింది.
Sri Lanka crisis 2022: పార్లమెంటు సమావేశం సందర్భంగా శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ మాట్లాడుతూ దేశంలో విదేశీ మారక నిల్వలు 700 కోట్ల (2019లో) నుంచి 5 కోట్ల డాలర్ల కంటే దిగువకు పడిపోయినట్లు తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అధికారులతో కీలక చర్చలకు గాను వాషింగ్టన్ వెళ్లివచ్చిన ఆయన దేశ ఆర్థిక పరిస్థితిని వివరించారు. 'మనం శక్తికి మించి వాడేశాం' అని పార్లమెంటుకు చెప్పారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సిన జాతీయ బాధ్యత అందరిపైనా ఉందని రాజకీయ పార్టీలకు గుర్తుచేశారు. ఐఎంఎఫ్‌తో చర్చల సందర్భంగా భారత్ అందిస్తున్న సాయాన్ని కొనియాడిన సబ్రే.. తాను భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రెండు సార్లు భేటీ అయినట్లు చెప్పారు. శ్రీలంకలో మరింతగా సంస్కరణలు చేపట్టడానికి ఐఎంఎఫ్ కార్యక్రమం ముఖ్యమైనదని మంత్రి సబ్రీ తెలిపారు. దీన్ని మరింత ముందుగా ఎంచుకోకపోవడాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. శ్రీలంకకు 3-4 వందల కోట్ల డాలర్లు అవసరమని, ఐఎంఎఫ్ సాయం ఫలించేవరకు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అన్నారు. అలాగని ఐఎంఎఫ్ 'అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ' కాదని పేర్కొన్నారు.
sri lanka crisis explained: మరోవైపు శ్రీలంక తమిళుల ప్రధాన పార్టీ అయిన టీఎన్‌ఏ, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే నాయకత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ కూడా గొటబాయ రాజపక్స ప్రభుత్వంపై సంయుక్తంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యాయి. అయితే అధ్యక్షుడు రాజీనామా కోరేందుకు ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదు. శ్రీలంక రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం దేశాధ్యక్షుడు తనకు తాను రాజీనామా చేయడం లేదా సుదీర్ఘ అభిశంసన ప్రక్రియద్వారా మాత్రమే పదవి నుంచి వైదొలుగుతారు. కాగా ఎస్‌జేబీ తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోతే మాత్రం ప్రధాని మహింద రాజపక్స, ఆయన మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొలంబోలోని పార్లమెంటు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన 12 మందిని శ్రీలంక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిరసనకారులు ప్లకార్డులు చేతబట్టి, పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పార్లమెంటు భవనం వైపు వస్తున్న సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
సుడిగుండంలో శ్రీలంక: శ్రీలంకను ఆర్థిక సంక్షోభం పూర్తిగా చుట్టుముట్టింది. దేశం రుణఊబిలో చిక్కుకోవడంతో పాటు నిత్యావసర వస్తువులు, రవాణాకు కీలకమైన పెట్రోధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహీంద రాజపక్స మాత్రం తాము తమ పదవులకు రాజీనామా చేసే ప్రసక్తేలేదని చెబుతున్నారు. కంటి తుడుపుగా మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆ స్థానంలో నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ చర్యలవల్ల ఎలాంటి పరిష్కారం లభించలేదు. రాజపక్సల కుటుంబం దేశాన్ని దారుణంగా దోపిడి చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. దాని ఫలితంగానే శ్రీలంక దివాలా తీసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శ్రీలంక హంబన్‌టొటకు చెందిన రాజపక్స కుటుంబం 1947 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పోడుజన పెరమున(శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్)కు చెందిన గొటబయ రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికే కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆయన సోదరులు చమల్ రాజపక్స, బసిల్ మంత్రులుగా, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రధానిగా ఉన్నారు. గతంలోనూ మహీంద రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. మహీంద ఇద్దరు కుమారులైన నమల్, యోషితాలకు కీలకమైన పదవులు దక్కాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గొటబయ, మహీందలు మినహా ఇతరులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరు కూడా తప్పుకొంటేనే శ్రీలంకలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. రాజపక్స కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకే బడ్జెట్‌లో 75శాతం వరకు నిధులు కేటాయించడం గమనార్హం.
సుంకాల రద్దుతో కటకట: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో (2019లో) విజయం సాధించిన అనంతరం గొటబయ రాజపక్స అనేక సుంకాలను రద్దు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే శ్రీలంకలో పన్నుల శాతం తక్కువే అయినా ఆర్థిక నిపుణుల సూచనలు పట్టించుకోకుండా పన్నుల శాతాన్ని తగ్గించారు. ఫలితంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కోసుకుపోయింది. రసాయన ఎరువులను వినియోగించకుండా నిషేధం విధించడంతో... ఆహార ఉత్పత్తిపై పెను ప్రభావం పడింది. వాస్తవానికి మహీంద రాజపక్స 2005 నుంచి 2015 వరకు రెండు సార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎల్‌టీటీఈని పూర్తిగా నిర్మూలించారు. అంతర్యుద్ధం ముగిసిన అనంతరం విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ప్రత్యేకించి చైనా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇందులో ముఖ్యంగా హంబన్‌టొట నౌకాశ్రయాన్ని పూర్తిగా బీజింగ్ నిధులతోనే నిర్మించారు. విదేశీ పెట్టుబడులతో మౌలిక సౌకర్యాలైన విమానాశ్రయం, రహదారులను నిర్మించారు. దేశం ఆర్థికంగా దూసుకుపోతోందని వీటి నిర్మాణాల ద్వారా ప్రచారం చేశారు. అయితే వీటి నుంచి ఎక్కువగా ఆదాయం రాలేదు సరికదా- ఈ పెట్టుబడులకు సంబంధించి రుణభారం భారీగా పెరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన అనంతరం లంక సర్కారు విలువ ఆధారిత పన్నును 15శాతం నుంచి ఎనిమిది శాతానికి తగ్గించడంతో పాటు, ఏడు ఇతర రకాల పన్నులను రద్దు చేసింది. ధార్మిక సంస్థలను పన్ను పరిధి నుంచి తప్పించింది. ఫలితంగా కేవలం 30 నెలల్లోనే శ్రీలంక ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. పన్నుల వసూలు దాదాపు సగం తగ్గడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకు, ఇతర వస్తువులకు పెద్దయెత్తున చెల్లింపులు చేయాల్సిరావడంతో సమస్య తలెత్తింది. శ్రీలంక ఆర్థిక స్థితిగతులపై ఆసియా అభివృద్ధి బ్యాంకు 2019లో ఒక అధ్యయనం వెలువరించింది. దీని ప్రకారం ఆ దేశంలో ఆదాయంకంటే వ్యయం ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమయింది. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన పర్యాటక రంగం-కరోనా కారణంగా కుదేలయింది.
అవినీతి, బంధుప్రీతి: సింహళ జాతీయవాదం ముసుగులో రాజపక్స సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారన్నది ప్రజాస్వామ్యవాదుల ఆరోపణ. మహీంద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఈ నిధుల్లో ఎక్కువ భాగాన్నిరాజపక్స సోదరులు, బంధువర్గాలు విదేశాలకు తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొటబయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలానికే వివాదాస్పదమైన 20వ రాజ్యాంగ సవరణను ఆమోదించారు. ఈ సవరణతో అధ్యక్షుడికి విశేష అధికారాలు లభించాయి. 2015లో మైత్రిపాల సిరిసేన హయాములో అధ్యక్షుడికి ఉన్న అధికారాలను చాలావరకు తొలగిస్తూ రాజ్యంగ సవరణ తీసుకువచ్చారు. అధ్యక్షుడి అధికారాల కత్తిరింపుతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పెద్ద పీట లభిస్తుందన్న ఆశయంతో అప్పట్లో శాసనకర్తలు ఆమోదించారు. ఇందుకు విరుద్ధంగా పూర్వపు విధానాన్ని తీసుకురావడంతో రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా వ్యవహరించేందుకు రాజపక్సలు యత్నిస్తున్నట్లు వైరి పక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయించినా, పెద్దగా సాయం అందే అవకాశం లేదని తెలుస్తోంది. దేశంలో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే రాజపక్సలు అధికారాన్ని వదులుకుంటారా అన్నది సందేహమే.
-కొలకలూరి శ్రీధర్
ఇదీ చదవండి: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం.. ప్రభుత్వంపై అవిశ్వాసం!