కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన సహకార విధానాన్ని(New Cooperative Policy) తేనున్నట్లు ఆ శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah News) తాజాగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 65 వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను మూడు లక్షలకు పెంచుతామని వెల్లడించారు. ప్రస్తుతం పది గ్రామాలకు ఒక సహకార సంఘం ఉందని, ఇకపై గ్రామానికి ఒకటి ఉండేలా చూస్తామని తెలిపారు. అన్ని సంఘాలను కంప్యూటరీకరించి, డీసీసీబీలు(DCCB bank merger news), నాబార్డుతో అనుసంధానిస్తామంటున్నారు. దేశంలో సహకార వ్యవస్థ క్రమేణా అసలు లక్ష్యానికి దూరమవుతోంది. పూర్తిగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులే దీన్ని శాసించే పరిస్థితులు దాపురించాయి. 'ఒక్కరి కోసం అందరూ.. అందరి కోసం ఒక్కరు' అనే నినాదంతో స్థాపించిన ఈ వ్యవస్థ అంతకంతకు సన్న, చిన్నకారు రైతాంగానికి అక్కరకు రాకుండా పోతోంది. దేశవ్యాప్తంగా ఈ రంగంలో ఏకీకృత విధానం లేకుండా రాష్ట్రానికో తీరుగా ఉండటంతో ఆశించిన ఫలితాలు చేకూరడం లేదు. దేశంలోని పార్టీలు తమ రాజకీయ అవసరాలకు మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించుకొంటున్నాయి. వ్యవసాయ శాఖలో అంతర్భాగంగా ఉన్న సహకార శాఖను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేరు చేసి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దీంతో పాటు జిల్లా, రాష్ట్ర సహకార బ్యాంకులను బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 పరిధిలోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ తరుణంలో సరైన సంస్కరణలు చేపట్టి, రైతాంగానికి ఆ ఫలాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
ఎన్నో ఇబ్బందులు
గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్నకారు రైతాంగానికి ఆర్థిక పరపతి అందించాలన్న లక్ష్యంతో 1904లో చట్టాన్ని తెచ్చి, సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. దీనికి కొనసాగింపుగా 1912లో నూతన చట్టాన్ని తీసుకురావడం ద్వారా నిధుల సమీకరణ కోసం ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించే అవకాశం లభించింది. అన్నదాతలకు అవసరమైన పరపతిని అందించేందుకు 1982లో భారత వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు)ను స్థాపించారు. నాబార్డు నుంచి రాష్ట్ర సహకార బ్యాంకుకు, దాని ద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లకు, అక్కడి నుంచి గ్రామ స్థాయిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా మూడంచెల విధానంలో రైతులకు రుణాలు అందుతున్నాయి. రాష్ట్ర సహకార బ్యాంకు, డీసీసీబీ, పీఏసీఎస్‌లు తమ నిర్వహణ ఖర్చుల కింద కొంత వడ్డీని కలిపి రుణాలను మంజూరు చేస్తాయి. దీనివల్ల అన్నదాతలకు రుణం అందేసరికి వడ్డీ భారం పెరుగుతోంది. ఒకే రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల యాజమాన్యాలు తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నాయి.
డీసీసీబీ యాజమాన్యాల పరిధి జిల్లాకు మాత్రమే పరిమితం కావడం, రాజకీయపరమైన నియామకాలు జరుగుతుండటంతో యాజమాన్యాలకు సరైన నైపుణ్యం కొరవడింది. వీటిని పర్యవేక్షించాల్సిన నాబార్డు, సహకార శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. తూతూమంత్రపు విచారణల పేరుతో కాలయాపన జరుగుతోంది. వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు యాజమాన్యాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఫలితంగా వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత యాజమాన్యాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి డీసీసీబీల్లో రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఇటీవల గుర్తించారు. దేశంలోనే పేరెన్నికగన్న కృష్ణా, తెలంగాణలోని ఖమ్మం డీసీసీబీలలోనూ అక్రమాలు బయటపడ్డాయి. వీటిపై విచారణ జరపడంలో, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు. యాజమాన్యాలకు వృత్తి నైపుణ్యం లేకపోవడం, సమీక్ష చేయాల్సిన నాబార్డు, సహకార శాఖ, రాష్ట్ర సహకార బ్యాంకులు పట్టించుకోకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. ఒకవేళ పర్యవేక్షణ ఉన్నా లోపాలపై నివేదిక ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. వాటిని సవరించడానికి, దుర్వినియోగమైన నిధులను రాబట్టేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు.
కంప్యూటరీకరణ తప్పనిసరి
దేశంలో ప్రస్తుతం 1,482 పట్టణ సహకార బ్యాంకులు, 58 అంతర్రాష్ట్ర పట్టణ సహకార బ్యాంకులు, 29 రాష్ట్ర సహకార బ్యాంకులు, 363 డీసీసీబీలు పనిచేస్తున్నాయి. ఈ రంగంలో రాజకీయ ప్రాబల్యాన్ని నివారించాలన్న లక్ష్యంతో దేశంలోని అన్ని సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకొచ్చారు. మూడంచెల సహకార పరపతి విధానంలో దిగువ అంచెలోని పీఏసీఎస్‌లు ఈ చట్టం పరిధిలోకి రావు. చిన్న బ్యాంకులుగా ఉన్న డీసీసీబీలను రాష్ట్ర సహకార బ్యాంకుల్లో విలీనం చేస్తే నిర్వహణ లోపాలను తగ్గించవచ్చు. కేంద్రంలో సహకార శాఖను ఏర్పాటు చేయడం వల్ల ఆ వ్యవస్థను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ తప్పనిసరి. దీని వల్ల వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులకు దీటుగా సేవలు అందించవచ్చు. అక్రమాలను నివారించవచ్చు. రాష్ట్ర సహకార బ్యాంకులకు షెడ్యూల్ హోదా ఉన్నందువల్ల ఆ శాఖలు సైతం షెడ్యూల్ బ్యాంకు హోదాతో పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలంగా ఒకేచోట తిష్ఠవేసిన ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా బదిలీ చేసే అవకాశం ఏర్పడుతుంది. మితిమీరిన రాజకీయ జోక్యాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించే వీలూ దక్కుతుంది.
రెండంచెలతో ప్రయోజనం
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సహకార పరపతి వ్యవస్థలో రెండంచెల విధానం అమలుకు మార్గదర్శకాలను సూచించింది. డీసీసీబీలను రాష్ట్ర సహకార బ్యాంకుల్లో విలీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రతిపాదనలను ఆర్‌బీఐకి సమర్పించాలి. తద్వారా డీసీసీబీలు తమ వాటాగా రైతులపై విధించే వడ్డీ భారం తగ్గించే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు రెండంచెల సహకార విధానంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, బిహార్, గుజరాత్, హరియాణా రాష్ట్రాలు ఈ విధానానికి మారేందుకు అనుమతించాల్సిందిగా ప్రతిపాదనలు పంపాయి. తాజాగా కేరళలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. కేరళ రాష్ట్ర సహకార బ్యాంకు రెండో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవించింది. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు ఈ బ్యాంకు ద్వారా సకాలంలో చేరుతున్నాయి. ఇదే బాటలో ఉభయ తెలుగు రాష్ట్రాలూ పయనిస్తే అన్నదాతలకు తక్కువ వడ్డీకి రుణాలు అందే అవకాశం ఉంటుంది.
- కంభంపాటి జగదీష్
ఇదీ చదవండి: