Maharashtra Political Crisis : ఎన్సీపీ నేత అజిత్ పవార్ వల్ల మహారాష్ట్ర రాజకీయ లెక్కలు మారాయి. తన అనూహ్య నిర్ణయాలతో రాజకీయ సమీకరణాలను మార్చారు. గత నాలుగేళ్లలో మహారాష్ట్ర నాలుగు.. ప్రమాణ స్వీకారాలు చూసింది. తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎన్డీఏలో చేరడం వల్ల.. 2019లో పోల్చితే ఆ కూటమి బలం ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఈ ఉత్సాహంతోనే ఎన్డీఏ 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. పార్టీల బలాబలాలు అనూహ్యంగా మారాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి.. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు) రాలేదు.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (మొత్తం సీట్లు 288) | |
బీజేపీ | 105 |
శివసేన | 56 |
కాంగ్రెస్ | 44 |
ఎన్సీపీ | 54 |
ఇతరులు | 29 |
ఫలితాల తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పటి మిత్రపక్షాలు శివసేన, బీజేపీలో చీలిక ఏర్పడింది. ఆ సమయంలో ఫడణవీస్ ప్రభుత్వానికి అజిత్ పవార్ మద్దతు ఇవ్వడం వల్ల.. మెజారిటీ 159కి (105+54) చేరింది. అప్పుడు ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు అజిత్ పవార్. ఆ తర్వాత అజిత్ పవార్‌ను.. శరద్ పవార్ బుజ్జగించడం వల్ల బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ ప్రభుత్వం నాలుగు రోజుల తర్వాత కూలిపోయింది.
బీజేపీ-అజిత్ పవార్ ప్రభుత్వం | |
పార్టీ | సీట్లు |
బీజేపీ | 105 |
అజిత్ పవార్ | 54 |
Maha Vikas Aghadi Alliance : బీజేపీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీలు 'మహా వికాస్ అఘాడీ' కూటమిని ఏర్పాటు చేశాయి. అనంతరం వారి బలం 154 సీట్లకు చేరగా.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వంలో కూడా అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం (Congress-NCP-Shivasena) | |
పార్టీ | సీట్లు |
కాంగ్రెస్ | 44 |
ఎన్సీపీ | 54 |
శివసేన | 56 |
Shiv Sena Shinde vs Uddhav Thackeray : కూటమి ప్రభుత్వం కొద్ది రోజులు బాగానే నడిచినా.. ఆ తర్వాత శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే తిరుగుబావుటా ఎగురవేయడం వల్ల ఆ పార్టీలో చీలిక ఏర్పడింది. శిందే వర్గంలోని 30 ఎమ్మెల్యేలు తమదే అసలైన శివసేన అంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా ఉద్ధవ్ ఠాక్రేకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 50 మంది మద్దతు తమకు ఉందని అసెంబ్లీలో పెద్ద పార్టీ బీజేపీ కూడా తమకు మద్దతు పలుకుతోందని దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం ఉద్ధవ్ బలనిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బలనిరూపణకు ముందే ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శివసేనలోని శిందే వర్గానికి బీజేపీ మద్దతు తెలపడం వల్ల.. శిందే ముఖ్యమంత్రిగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడణవీస్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోంది.
బీజేపీ-శివసేన ప్రభుత్వం | |
పార్టీ | సీట్లు |
బీజేపీ | 105 |
శివసేన (శిందే వర్గం) | 50 |
ఇతరులు | 15 |
Maharashtra NDA Alliance : మరోసారి ఎన్సీపీ శరద్ పవార్ నాయకత్వంపై తిరుబాటు ఎగురవేసిన అజిత్ పవార్.. ఎన్డీఏ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఎన్సీపీకి మొత్తం 53 స్థానాలు ఉండగా.. అందులో 36 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని అజిత్ పవార్ సన్నిహితుడు ఒకరు తెలిపారు. త్వరలో ఈ సంఖ్య 46కు చేరుకుంటుందని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి సంఖ్యా బలం 170 నుంచి 210కి చేరిందని మంత్రి ఉదయ్ సమంత్ అన్నారు.
బీజేపీ-శివసేన-ఎన్సీపీ ప్రభుత్వం | |
పార్టీ | సీట్లు |
బీజేపీ | 105 |
శివసేన (శిందే వర్గం) | 50 |
ఎన్సీపీ (అజిత్ పవార్) | 40 |
ఇతరులు | 15 |
NCP Leader Ajit Pawar : 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల బలాబలాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ ప్రభావం రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలపై పడనుంది. అప్పటితో పోలిస్తే ఎన్డీఏ బలం కూడా రెట్టింపు అయింది. బీజేపీకి ఇది అనూకూలించే పరిణామమే. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ఎన్డీఏలో చేరడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్పందించారు. 'కేబినెట్‌లో సీట్ల పంపకం గురించి చర్చించడానికి తగినంత సమయం ఉంది. మహారాష్ట్రను అభివృద్ధి చేయడానికి మేము కలిశాము. వారు (ప్రతిపక్షం) గత లోక్‌సభ ఎన్నికల్లో 4-5 సీట్లు సాధించారు. ఈసారి వారు ఆ సీట్లను కూడా తిరిగి పొందలేరు' అని శిందే చెప్పారు.