'బాల్యారంభ దశ సున్నితమైంది. ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడే బీజాలు నాటాలి' అని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ విషయాలు అనుభవపూర్వకంగా తెలిసినవారు మన పూర్వీకులు. అందుకే పిల్లల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వారి మానసిక వికాసానికి ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకునేవారు.
పరిసర వాతావరణం ముఖ్యం
‘పిల్లల చుట్టూ ఉండే వాతావరణానికి, వారి మనస్తత్వానికి సంబంధం ఉంటుంది. బాల్యంలో ఏ మాత్రం మొరటుతనానికి గురైనా జీవితంలో సరిదిద్దడం సాధ్యం కాదు’ అని మనో విశ్లేషకులూ చెబుతారు. పరిసర వాతావరణం అంటే కుటుంబం, అందులోని వ్యక్తులు, సమవయస్కులు ముఖ్యమైనవారు. వారి ద్వారానే పిల్లల సామర్థ్యాన్ని ప్రత్యేక బోధన ద్వారా అభివృద్ధి పరచవచ్చన్నది వారి ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఆనాటి బాలల సాహచర్యం ఆ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే గడిచేది. పరిసరాల్లో ఉండే సమవయస్కుల స్నేహం సైతం వారి మనో వికాసానికి దోహదం చేసినా అది పరిమితమే. అందుకే కుటుంబంతో విడదీయలేని అనుబంధం కలిగి ఉండేవారు పూర్వీకులు.
కలవడానికీ సంకోచించే పరిస్థితులు
రాను రాను పరిస్థితులు మారాయి. అనేక కారణాలతో బిడ్డలను పసితనం నుంచే క్రెచ్, ప్లే స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్, కాన్వెంట్లు, హాస్టళ్లలో చేర్చేసి తమ పని సులువు చేసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు నేటితరం తల్లిదండ్రులు. ఇంటిపట్టున ఉన్నా కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ తదితరాలకు అలవాటు చేసేస్తూ వారినో ప్రత్యేకమైన లోకంలోకి బలవంతంగా నెట్టేస్తున్నారు. పైగా తాము చెప్పేకన్నా, ఆ రకంగా అయితేనే బాగా అవగాహన కలుగుతుందని తమ అలసత్వాన్ని సమర్థించుకుంటున్నారు. ఫలితంగా సహజంగా పొందగలిగే తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు విఘాతం కలిగింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో పిల్లలను బయటకు పంపడానికి, ఇతర పిల్లలతో ఆడుకోనివ్వడానికి, కనీసం కలవనివ్వడానికి సైతం సంకోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల ఇంటిపట్టునే బందీల్లా ఉండిపోవలసి వస్తున్న ఆ చిన్నారుల మానసిక వికాసం కుంటువడుతోంది. ఫలితంగా విసుగు, మొండితనం, మంకు పట్టుదల లాంటి అనేక దుర్లక్షణాలు వారిలో పొడచూపుతున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మానసిక రుగ్మతలుగా మారే అవకాశాలు ఉన్నాయి. అది వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలిగిస్తుంది.
తల్లితండ్రులు త్యాగం చేయాలి
ఇలాంటి పరిస్థితులను నివారించడానికి కంప్యూటర్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లను పక్కనపెట్టి, పాతరోజుల్లో పెద్దలు అనుసరించిన విధానాలను ఒక్కసారి గుర్తు చేసుకోవలసిన తరుణం వచ్చింది. వాటిని అవలంబిస్తూ, వయసులవారీగా అనుసరిస్తూ పసివారి మనసుల్లో సున్నితత్వాన్ని ప్రోది చేయవలసిన అవసరం, అవకాశం ఇప్పుడు వచ్చింది. దీనికిగాను తలిదండ్రులందరూ కొంత త్యాగం చెయ్యవలసిన తరుణం ఇది. నిజానికి అది త్యాగం కానేకాదు. పాతకాలంలో అది ప్రధాన బాధ్యత. ఇంకాస్త ముందుకెళ్తే సహజ ప్రక్రియ. ఈ పరిస్థితుల్లో నేటి తల్లిదండ్రులు పాత రోజులను, వారి బాల్యాన్ని గుర్తుచేసుకోవాలి. నాటి పెద్దలు అనుసరించిన విధానాలను అవలంబించాలి.
అప్పట్లో..
నేటి మధ్య వయస్కుల వరకూ బాల్యంలో వారి తల్లిదండ్రులు అయిదేళ్లు పూర్తయిన తరవాతే పిల్లలను బడికి పంపేవారు. అంతవరకు తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు వారిని సాకేవారు. ఫలితంగా కుటుంబంపట్ల అవగాహన, ప్రేమ పసితనంలోనే బోధపడేది. 'చదువు' పేరిట కాకుండా విజ్ఞానదాయక విషయాలను స్వయంగా పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని బోధించేవారు. పురాణాలు, సంస్కృతీ సంప్రదాయాలను ఆటలు, కథలు, పద్యాలు, పాటలు, పొడుపు కథల రూపంలో, నిత్య వ్యవహార కార్యకలాపాలుగా చెప్పేవారు. తిథి వార నక్షత్రాలు పురాణ కథలను ఏదో ఒక సమయంలో ప్రస్తావించేవారు. ఇంట్లో అనేక ఆటలను వారితో కలిసి ఆడేవారు. అందువల్లే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉండేవారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తట్టుకోగలిగేవారు.
అవకాశం వచ్చింది.. అందిపుచ్చుకోవాలి
కరోనా కాలంలో అందివచ్చిన ఈ సదవకాశాన్ని నేటితరం తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవాలి. తమకు తెలిసిన విషయాలను, చెప్పాల్సిన అంశాలను తెలుసుకొనైనా పిల్లలకు సున్నితంగా బోధించాలి. చిన్నచిన్న పనులు పిల్లలతో చేయించాలి. ఆపై తప్పులెన్నకుండా స్నేహభావం, ప్రోత్సాహం, స్నేహం, ప్రశంసలతో మార్గదర్శనం చేయాలి. సంకుచిత మనస్తత్వానికి పిల్లలు అలవాటు పడకుండా త్యాగమూర్తులు, నిస్వార్థపరుల గురించి బోధించి మంచి వ్యక్తులుగా ఎదిగేలా జాగ్రత్తలు తీసుకునే తరుణమిదే. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతానుబంధాలను సందర్భాలను సృష్టించి వివరించాలి. ఆన్‌లైన్ తరగతుల హడావుడికన్నా పిల్లలను స్వయంగా తామే తీర్చిదిద్దుకునే అపురూపమైన అవకాశం ఈ తరం తల్లిదండ్రులకు కరోనా వల్ల అందివచ్చింది. పెద్ద బాలశిక్షను తిరగేయండి. చిన్ననాటి కథలను పునశ్చరణ చేయండి. పురాణ కథలను స్ఫురణకు తెచ్చుకోండి. వాటి సారమే- మీ పిల్లలకు 'ఇల్లే బడి' పాఠ్యప్రణాళిక అవుతుంది!
- శార్వరీ శతభిషం
ఇదీ చదవండి: హ్యూమన్ కంప్యూటర్ 'శకుంతలా దేవి'కి మరో గౌరవం