ETV Bharat / opinion

భారత్​లో జనాభా నియంత్రణ సాధ్యమేనా?

జనాభా నియంత్రణపై ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల తాజా నిర్ణయాలతో దేశంలో మరోసారి జనాభా చర్చనీయాంశంగా మారింది. నిరక్షరాస్యత, పేదరికం, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటి మూడు అంశాలు సంతానం పెరిగేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. వీటిని నియంత్రించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్య, ఆర్థిక అభ్యున్నతి, మహిళా సాధికారత వంటివే ఈ విషయంలో మేలైన ఫలితాల్ని ఇస్తాయని నిర్దుష్టంగా చెప్పవచ్చు. ఇలాంటి చర్యలను పకడ్బందీగా అమలు చేస్తే, ప్రత్యేక నియంత్రణలతో అవసరం తక్కువగానే ఉంటుంది.

population control
జనాభా నియంత్రణ
author img

By

Published : Jul 25, 2021, 7:00 AM IST

దేశంలో జనాభా అంశం మరోసారి తీవ్రస్థాయిలో చర్చకు వచ్చింది. కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రపంచంలోనే తొలిసారిగా జాతీయ కార్యక్రమం తీసుకొచ్చిన దేశం మనది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా జనాభాను స్థిరీకరించేలా జననాలను తగ్గించాలనే లక్ష్యంతో 1952లోనే జాతీయ కార్యక్రమంపై దృష్టిపెట్టారు. కాకపోతే, అత్యవసర పరిస్థితుల తరవాత బలవంతపు కుటుంబ నియంత్రణ చర్యలపై ప్రతికూల ప్రజాస్పందన పర్యవసానంగా జనాభా అంశం అటకెక్కింది. ఆ తరవాత తరాలు మారినా, జనాభా అనేది రాజకీయ వర్గాలకు ఏమాత్రం అంగీకారయోగ్యమైన అంశం కాకుండా పోయింది. జనాభా నియంత్రణపై ఉత్తర్‌ప్రదేశ్‌, అసోమ్‌ రాష్ట్రాల తాజా నిర్ణయాలతో దేశంలో మరోసారి జనాభా తుట్టె కదిలినట్లయింది. అన్ని వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ఇటీవల 'ఉత్తర్‌ప్రదేశ్‌ జనాభా విధానం 2021-30'ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆవిష్కరించారు. యూపీ న్యాయ కమిషన్‌ రూపొందించిన జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ ముసాయిదా బిల్లులో ఇద్దరు సంతానంతో సరిపెట్టుకొనే దంపతులకు పలురకాల ప్రోత్సాహకాలు ప్రకటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాభా పరిమితులకు సంబంధించిన చట్టనిబంధనలు అమలులో ఉన్నాయి. మరి, ఇలాంటి చట్టాలు నిజంగా ప్రభావం చూపగలిగితే, హిందీ బెల్ట్‌ రాష్ట్రాల్లో అధిక సంతాన సాఫల్య రేటు ఎందుకుందనే సందేహం తలెత్తక మానదు.

పెరుగుదల నిజమేనా?

ప్రస్తుతం నేతలంతా ఆందోళన చెందుతున్న స్థాయిలో జనాభా పెరుగుతోందా అనేది చర్చనీయాంశమే. ఎందుకంటే, గత దశాబ్ద కాలంలో దేశంలో మొత్తం సంతానసాఫల్య రేట్లు (టీఎఫ్‌ఆర్‌) గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. యూపీ విషయాన్నే తీసుకొంటే- జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-4 (2015-16) ప్రకారం ఆ రాష్ట్రంలో పదేళ్ల క్రితం 3.8గా నమోదైన టీఎఫ్‌ఆర్‌ 2.7కు పడిపోయింది. జాతీయ టీఎఫ్‌ఆర్‌ క్షీణతకన్నా యూపీలో తగ్గుదల ఎక్కువగానే ఉండటం గమనార్హం. బాలికా విద్య, ఆర్థిక వృద్ధి, వలసలు, శిశుమరణాల్లో తగ్గుదల, ఆస్పత్రి కాన్పులు పెరగడం వంటివన్నీ తోడైతేనే జనాభా స్థితిగతుల్లో భారీస్థాయిలో మార్పులకు కారణమవుతాయన్న సంగతి గుర్తించాలి. ఇవన్నీ ఎలాంటి జనాభా నియంత్రణ విధానాలు లేకపోయినా సుసాధ్యమయ్యాయన్నది గుర్తెరగాలి. మరోవైపు, జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టాలు, విధివిధానాలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. దీనివల్ల పేదలు, సామాన్యులకు అధికార యంత్రాంగం నుంచి తీవ్రస్థాయి వేధింపులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రోత్సాహకాలు అందించేందుకు లబ్ధిదారులను గుర్తించడం భారీ ప్రహసనంగా మారుతుంది. అనర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ వంటి వాటి నుంచి వారిని పరిహరించే ప్రక్రియ భారీ అవినీతికి, దుర్విచక్షణకు, గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉంది. కేవలం ఉన్నతాధికార వ్యవస్థపై విశ్వాసంతో, అస్తవ్యస్తంగా రూపొందించే చట్టాలు ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాలు చూపడమే కాకుండా, విపత్తులా పరిణమిస్తాయన్న సంగతిని అధికార స్థానాల్లో ఉండేవారు గుర్తించాలి. యూపీలోని పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో జనాభా రేటు స్వల్పంగా ఎక్కువగా ఉన్నందువల్ల పల్లెపేదలు- విద్య, వైద్య సౌకర్యాలు, ఉద్యోగాల పరంగా అవకాశాల్ని నష్టపోవాల్సి వస్తుంది. భారీ స్థాయిలో సామాజిక అంతరాలు, అవాంతరాలు చోటుచేసుకుంటే రాజకీయ పరంగానూ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు.

చేయాల్సింది ఎంతో..

బాల్య వివాహాల్ని నిరోధించడం, పెళ్లీడు వచ్చాకే వివాహాలు జరిగేలా చూడటం, సురక్షిత కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని పాటించడం, ఆడశిశు హత్యల్ని నిలువరించడం, ఆస్పత్రి కాన్పులు పెంచడం వంటి చర్యలెన్నో తీసుకోవాలి. వీటితోపాటు, తల్లికి 21 ఏళ్లు నిండిన తరవాతే మొదటి సంతానానికి జన్మనివ్వడం, ఆ తరవాత పిల్లల మధ్య ఎడం పాటించడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా అమలయ్యేలా చూడగలిగితే ఆరోగ్యకరమైన రీతిలోనే జనాభా స్థిరీకరణను సాధించవచ్చు. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం పురుషుల్లో వేసెక్టమీ శస్త్రచికిత్సను అయిదు శాతంకన్నా పెంచాలి. జనాభా స్థిరీకరణ కోసం దీనిపై దృష్టిసారిస్తే మేలు. ఇలాంటి వాటన్నింటి కోసం పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థను నిర్మించాలి. ఏటా బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి అరకొరగా కేటాయింపులు విదిలిస్తూ, క్షేత్రస్థాయిలో ఇలాంటి మౌలిక మార్పుల్ని సాధించడం ఆచరణ సాధ్యమేనా అన్నది ప్రశ్న. జనాభా నియంత్రణ వంటి సున్నితమైన సామాజిక అంశాల్లో కింది నుంచి మార్పుల్ని తీసుకొస్తేనే ఫలితాలు దక్కుతాయి. పైనుంచి చట్టాలు, ఆదేశాలు, నియంత్రణలను విధిస్తే- గతంలో ఎదురైన చేదు అనుభవాలనే మరోసారి చవిచూడాల్సి రావచ్చు. అధిక సంతానం కలిగినవారిపై పలురకాల జరిమానాలు, శిక్షల్ని ప్రతిపాదించడం ఎప్పుడూ సరైన ఫలితాలను ఇవ్వదు. గత అనుభవాలూ ఇదే చాటుతున్నాయి. నిరక్షరాస్యత, పేదరికం, వైద్యసేవలు అందుబాటులో లేకపోవడం వంటి మూడు అంశాలు సంతానం పెరిగేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. వీటిని నియంత్రించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్య, ఆర్థిక అభ్యున్నతి, మహిళా సాధికారత వంటివే ఈ విషయంలో మేలైన ఫలితాల్ని ఇస్తాయని నిర్దుష్టంగా చెప్పవచ్చు. ఇలాంటి చర్యలను పకడ్బందీగా అమలు చేస్తే, ప్రత్యేక నియంత్రణలతో అవసరం తక్కువగానే ఉంటుంది.

- డి.శ్రీనివాస్‌

ఇదీ చదవండి:'అభివృద్ధికి ఆటంకంగా జనాభా పెరుగుదల'

ఆ రాష్ట్రంలో త్వరలోనే 'ఇద్దరు పిల్లల' నిబంధన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.