Indian Rupee Value Decrease: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. 2020-21 నాటికి రూపాయి మారకపు విలువ అంతకుముందు ఏడాది కంటే 3.32శాతం పెరిగితే.. 2021-22 ముగిసే నాటికి ఈ విలువ 3.53శాతం మేర తగ్గింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రెండు రోజుల క్రితం సుమారు 77.44 స్థాయికి దిగజారింది. ఇది మరింత క్షీణిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి రూపాయి-డాలరు విలువలు సమానంగా ఉండేవి. అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యం, ఆర్థిక చెల్లింపులు, విదేశీ పెట్టుబడులు, రుణాలు ఇవన్నీ డాలర్ల రూపంలోనే జరుగుతాయి. భారత్ తన అవసరాలకు అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. స్వాతంత్య్రం తరువాత కేవలం రెండేళ్లు స్వల్ప వాణిజ్య మిగులు తప్ప- విదేశీ వాణిజ్యం లోటుతోనే కొనసాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో అన్ని దేశాల కరెన్సీ విలువలూ బాగా పతనమయ్యాయి. భారత్ విషయంలో ఆర్‌బీఐ చొరవ తీసుకుని తనవద్ద పోగుపడి ఉన్న విదేశమారక నిల్వల్లో కొంత మార్కెట్‌లో అమ్మకానికి పెట్టి- కరెన్సీ పతనాన్ని కొంతవరకు నియంత్రించగలిగింది. మార్చి మొదటి వారంలో ఉన్న 63,200 కోట్ల డాలర్ల విదేశమారక నిల్వలు 2022 ఏప్రిల్ ఒకటోతేదీ నాటికి 60,600 కోట్ల డాలర్లకు తగ్గాయి.
కొనసాగుతున్న అనిశ్చితి.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చమురు ధరల జోరు, అమెరికా వడ్డీ రేట్లను పెంచడంవంటి పరిణామాలు ఇటీవల మన రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. కొన్నాళ్ల క్రితం 20 డాలర్లకే లభించిన ముడిచమురు పీపా- ఇటీవల అమాంతంగా ధర పెరిగి 130 డాలర్ల స్థాయికి చేరి, ఇప్పుడు 103-105 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఎగుమతుల కన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే వాణిజ్యలోటు ఏర్పడుతుంది. వాణిజ్యలోటు పెరిగినంత కాలం రూపాయి పతనమవుతునే ఉంటుంది. 2021-22లో భారత ఎగుమతులు 41,700 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఎగుమతుల విలువ 29,100కోట్ల డాలర్లు. ఏడాది కాలంలో ఎగుమతులు 43.18శాతం మేర పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.
నిజానికి అదే కాలంలో మన దిగుమతులు 39,400కోట్ల డాలర్ల నుంచి 61,000కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫలితంగా 19,241కోట్ల డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడి- రూపాయి పతనానికి దారితీసింది. ప్రపంచ వృద్ధిరేటు మందగిస్తున్న నేపథ్యంలో 2022-23లో ఎగుమతుల్లో జోరు నెలకొంటుందా అనేది సందేహాస్పదమే. యుద్ధం, కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతుండటం వంటి ప్రతికూలతలు సందేహాలకు మరింత ఉతమిస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల వాణిజ్యలోటు మరింత పెరిగి రూపాయి ఇంకా పతనం కావచ్చు. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా సుమారు 28శాతం. రష్యా యుద్ధంపై అనిశ్చితి కొనసాగినన్నాళ్లూ చమురు ధరలూ దిగివచ్చే పరిస్థితి లేదు. రాబోయే రెండు త్రైమాసికాల్లోపు చమురు ధరలు దిగిరాకపోతే భారత్ భారీగా వాణిజ్యలోటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దిగుమతుల్లో మూడోస్థానం బంగారానిది. అంతర్జాతీయ విపణిలో తాజాగా ఔన్సు బంగారం ధర 1,840 డాలర్ల స్థాయిలో ఉండగా.. రాబోయే రోజుల్లో ఇది 2,100 డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. అదే జరిగితే దిగుమతుల బిల్లు మరింత పెరిగి, తద్వారా వాణిజ్య లోటు ఇంకా ఎగబాకుతుంది.
సామాన్యుడిపై ప్రభావం.. రూపాయి క్షీణతవల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి డాలర్లలోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపుల కోసం ఎక్కువ వ్యయమవుతుంది. తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు మాత్రం క్షీణించిన కరెన్సీవల్ల లబ్ధి పొందుతాయి. భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఫలితంగా ఉత్పత్తి ధర పెరిగిపోతుంది. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది.
విదేశీ విద్య కోసం బ్యాంకుల్లో రుణం తీసుకునేవారిమీదా భారం అధికమవుతుంది. ఒకవేళ రూపాయి విలువ పెరిగితే అప్పు తీర్చడం సులువవుతుంది. విదేశాల్లో ఇతర ఖర్చుల కోసం స్వదేశీ కరెన్సీని అధికంగా చెల్లించాల్సి వస్తుంది. మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలెక్ట్రానిక్ ఉపకరణాలు రూపాయి క్షీణతతో ప్రియమవుతాయి. వాటి విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడమే ఇందుకు కారణం. రూపాయి క్షీణతవల్ల ఎక్కువగా లబ్ధిపొందేది ప్రవాస భారతీయ కుటుంబాలు. ఎందుకంటే మారకంలో ఒక డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి. తాజాగా డాలరు ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షల వల్ల కొన్ని దేశాలు తమ విదేశీ చెల్లింపులు ఇకపై డాలర్ల రూపేణా కాకుండా తమ స్వదేశీ కరెన్సీ ద్వారా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యాకు వాణిజ్య చెల్లింపుల విషయంలో భారత్, చైనా, సౌదీ అరేబియాలు సహా చాలా దేశాలు ఈ మేరకు వ్యూహాలను మార్చుకొంటున్నాయి. గతంలో అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించినప్పుడు భారత్ ఆ దేశానికి రూపాయల్లోనే చెల్లింపులు చేసింది. ఈ విధానం మిగతా అన్ని దేశాల్లోనూ కార్యరూపం దాలిస్తే డాలరు తన ప్రాభవాన్ని కోల్పోవడం ఖాయం!
తగ్గుతున్న ఎఫ్‌డీఐలు.. గడచిన ఏడాది కాలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లు క్రమేపీ తగ్గుతున్నాయి. చమురు, బంగారం దిగుమతులతో భారీగా పెరిగిన వాణిజ్యలోటు, మందగించిన విదేశీ పెట్టుబడులు కలిసి కరెంట్ ఖాతా లోటు 2021 ఏప్రిల్-డిసెంబరు కాలానికి జీడీపీలో 1.2శాతం స్థాయికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది మిగులుతో ఉండటం గమనార్హం. విదేశీ సంస్థాగత పెట్టుబడులపై ఆశపెట్టుకోవడం సరైంది కాదు. ఎందుకంటే అమెరికా తన వడ్డీరేటు పెంచితే, ప్రపంచంలో ఎక్కడున్నా తక్షణం ఈ పెట్టుబడులు అక్కడికి వెళ్లిపోతాయి. అందుకే వీటిని 'బటర్ ఫ్లై' పెట్టుబడులంటారు.
- భరత్ సాయి
ఇదీ చదవండి: శ్రీలంకను ముంచిన రాజపక్స పాలన.. పాతాళానికి మారక నిల్వలు