ETV Bharat / opinion

కరోనా ప్రభావంతో దేశంలో ఉపాధి సంక్షోభం! - కొవిడ్​ రెండోదశ

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్​డౌన్​ సమయంలో అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. కొవిడ్​ రెండోదశ కారణంగా దేశంలో ఉపాధి సంక్షోభం తలెత్తింది. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి వెళ్లింది.

unemployment crisis
ఉపాధి సంక్షోభం
author img

By

Published : Jul 30, 2021, 7:33 AM IST

'గురూ... ఇది విన్నావా..? కోల్‌కతాలో శవ పరీక్షలు చేసే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో సహాయకుడి పోస్టుకు ఇంజినీర్లు, పీజీలు, ఎంబీఏలు చదివిన ఎనిమిదివేల మంది దరఖాస్తు చేశారట... ఏమిటీ విడ్డూరం?'

'నువ్వంతలా ఆశ్చర్యపోవడానికేమీ లేదురా... ఈత గింజలు నాటి తాటి మొక్కలు రావాలంటే సాధ్యపడదు... బయటి ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో తెలియకుండానే, ఏ రకమైన ప్రాక్టికల్‌ శిక్షణా లేకుండానే- ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ సైతం పూర్తి చేయగల సువర్ణావకాశం మనదేశంలో మాత్రమే సాధ్యం! ఈ కరోనా కాలంలో అది పరాకాష్ఠకు చేరి, మొన్నీమధ్య ఒక డాక్టర్ల బ్యాచ్‌కి, ప్రాక్టికల్స్‌ పెట్టే అవకాశం లేదంటూ, పట్టాలు కూడా ఇచ్చేశారు!'

'ఇలాంటి చదువే పూర్తి చేసుకున్న ఓ జువాలజీ ప్రొఫెసర్‌ క్షేత్రస్థాయి పర్యటనకని అడవికి వెళ్లి, టెంట్‌లో పడుకుని, సహాయకుణ్ని అడిగాడట- 'ఈ పున్నమి రాత్రి చుక్కల్నీ చంద్రుడినీ చూస్తూ, వెన్నెలను ఆస్వాదిస్తుంటే నీకేమనిపిస్తోంది' అని... వాడు అన్నాడట 'సార్‌, ఈదురుగాలికి మన టెంట్‌ ఎప్పుడో ఎగిరిపోయింది!’ అని... పుస్తక జ్ఞానమే కానీ లోక జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటుందిరా...’

'వింటున్నాను కదా అని మరీ అంతలా అనకు గురూ... ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదింటిదాకా- అయితే కాలేజీల్లో లేకపోతే ఆన్‌లైన్‌ క్లాసుల్లో గడిపే పిల్లలకు లోకజ్ఞానం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది?'

'అదేరా నా బాధ కూడా... వెనకటికి, అంటే ఈ 'ర్యాంకుల వెర్రి' లేనంత కాలమూ, కనీసం లాంగ్వేజి క్లాసులైనా ఉండేవి. ఆ పేరు మీద తెలుగు శతకాలనో, పద్యాలనో వింటే కొంచెం లోకజ్ఞానమైనా వచ్చేది... ఆ అవకాశమే లేకుండా చేస్తున్నాయి కార్పొరేట్‌ కాలేజీలు...'

'ఇంతకీ ఏమంటావ్‌ గురూ..?'

'గేదె గోడెక్కి పేడ ఎలా వేసిందన్న అనుమానం పిల్లాడికి వచ్చిందంటే- అయితే వాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ కోచింగ్‌ తీసుకునైనా ఉండాలి, లేకపోతే ఫస్ట్‌ ర్యాంకరైనా అయి ఉండాలి... అలా ఉన్నాయి మన చదువులు. ఏ చదువు చదివినా చివరికొచ్చే సరికి... మా మిఠాయి దుకాణం మిత్రుడు హరిబాబు అన్నట్టుగా- డబ్బాని కొట్టు, డబ్బులు పట్టు అన్నట్లుగా ఉంటోంది ఈ రోజుల్లో... డబ్బా అంటే కంప్యూటర్‌ అని వాడి ఉవాచ. దొరికితే చిన్నదో, చితకదో ఏదో ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, లేకపోతే గుమాస్తాగానో... చదువుకూ చేసే పనికీ ఏమాత్రమూ పొంతన లేని ఉపాధిలో కూరుకుపోతున్నారు యువత, గత్యంతరం లేక!'

'అదే గురూ నేననేదీ... ఏదో ఒక రకంగా జీవనం గడవాలి కదా!'

'అందుకనేరా మా హరిబాబు తొందరగా తెలివి తెచ్చుకుని, కుమారుడి కంప్యూటర్‌ డబ్బా ఉద్యోగం మానిపించి, ఊళ్ళోనే ఇంకో బ్రాంచి తెరిచి వాడికప్పగించాడు... రెండేళ్లు గడిచేసరికి మాంఛి రాబడి సంపాదిస్తున్నాడు, నలుగురికీ పని కల్పిస్తున్నాడు.'

'అలా పెట్టుబడి పెట్టే అవకాశం ఎంత మందికి ఉంటుంది గురూ?'

'పెట్టుబడే అక్కర్లేదురా... తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు... మా వీధి చివర బజ్జీలమ్మేవాడు నా క్లాస్‌మేట్‌. వాళ్ళ నాన్న మొదలు పెట్టాడా వ్యాపారాన్ని, నా చిన్నతనంలో... బజ్జీల ఐలయ్య అంటే తెలియని వాళ్లుండరు మా ఊళ్ళో. పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్లు చేసి, నాలుగంతస్తుల ఇళ్లు రెండో మూడో కట్టాడు, ఆ బజ్జీల బండితోనే! అందుకే వాళ్ళ పిల్లలు సైతం అదే వ్యాపారం చేస్తున్నారు...'

'అయితే మాత్రం...?'

'చెబుతాను వినరా... మొన్నీ మధ్య కాన్పూరులో ఆదాయ పన్ను అధికారుల పరిశీలనలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి... రోడ్డు పక్కన పళ్లు అమ్మేవాళ్ళు; పాన్‌ షాపులు, చిన్న కిరాణా వర్తకులు; రోడ్ల మీద తిరుగుతూ సమోసాలు, మిక్స్చర్లు అమ్మే వాళ్లలో 256 మంది కోటీశ్వరులు ఉన్నట్టు గుర్తించారు! చెత్త ఏరుకునే వారికి, మూడుకంటే ఎక్కువగా కార్లు ఉన్నాయట! శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని వీళ్ళందరూ నిరూపిస్తున్నార్రా!'

'ఇన్ని మాటలెందుకు గురూ... సూటిగా చెప్పు నువ్వేమనుకుంటున్నావో...'

'జరుగుతున్న వాస్తవాలు నీ కళ్లముందు ఉంచానురా... ఇందులో నా సొంత అభిప్రాయానికి చోటులేదు! ఇన్‌కమ్‌ టాక్స్‌ లెక్కలు ఇంజినీరు చేయగలడా? డ్యాన్సులు, డప్పు కోలాటాలు ఆడటం డాక్టరుకు చేతనవుతుందా? మంచి వాసనొస్తున్నాయని మల్లెపూలతో పచ్చడి నూరుకుంటామా? 'జీవవైవిధ్యం' లాగా జీవన వైవిధ్యం కూడా ఉండాలంటున్నాను... తినడానికి తీపి, కారం, పులుపు, చేదు ఎలాగైతే అవసరమో, జీవనానికి కూడా అన్ని రంగాలు, అన్ని వృత్తులు, అన్ని వ్యాపకాలు అంతే అవసరం! 'హీనంగా చూడకు దేన్నీ, శ్రమిస్తే లక్ష్మీ మయమేనోయ్‌ అన్నీ'

'సర్లే గురూ... నువ్వు అంతలా చెప్పాక, ఇక నేనేమంటానూ... నేను కూడా ఓ ఉపాధి మార్గం వెతుక్కుంటాను!'

- శారద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.