సాయంచేయాలి:
ఏదైనా పని చేస్తామని పిల్లలు ఉత్సాహం చూపించినప్పుడు.. అది నీవల్ల కాదని వాళ్లను నిరుత్సాహపరచకూడదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో పని చేయిస్తే సమయం వృథా అవుతుందనుకుంటారు. దాంతో వాళ్లకు ఎప్పటికీ పనిరాదు. దగ్గరుండి సాయంపడి వాళ్లా పని పూర్తిచేసేలా చూడాలి. దీనివల్ల పిల్లలకు వాళ్లమీద వాళ్లకు నమ్మకం పెరుగుతుంది.
మెచ్చుకోవాలి:
మీరు చెప్పిన పనిని పిల్లలు పూర్తిచేస్తే వాళ్లను మెచ్చుకుని ప్రోత్సహించాలి. ఆ పొగడ్త వాళ్లకు ఆనందాన్ని కలిగించడం వల్ల మరింత ఉత్సాహంగా పనులు చేస్తారు. కానీ వాళ్లను పొగడటమే పనిగా పెట్టుకోకూడదు. అలా అలవాటు పడితే.. చిన్నపని చేసినా పొగడ్తల కోసం ఎదురుచూడటం మొదలుపెడతారు.
బలాలను గుర్తించాలి:
పిల్లల బలహీనతలను పదేపదే ఎత్తిచూపకూడదు. ‘నీ చేతిరాత బాగోదు, నీకు చదివింది ఏదీ గుర్తుండదు. నువ్వు ఏ పనీ సరిగ్గా చేయలేవు.’ అంటూ.. ఇలా బలహీనతల గురించి మాత్రమే మాట్లాడితే.. కొంతకాలానికి వాళ్ల మీద వాళ్లకు నమ్మకం పోతుంది. సున్నిత మనస్కులైన పిల్లలు సాధారణంగా విమర్శలను తట్టుకోలేరు. వారి బలాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
నేస్తంలా మారాలి:
తమ భావోద్వేగాలను అమ్మానాన్నల దగ్గర పంచుకునే చనువు పిల్లలకు ఉండాలి. పెద్దవాళ్లు, పిల్లల మధ్య కనిపించని విభజన రేఖేదో ఉండకూడదు. తల్లిదండ్రులను చిన్నారులు ఆత్మీయ నేస్తంలా భావించాలి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.