ఆహారంలో మసాలా దినుసులు, ఎండుఫలాల వినియోగం భారీగా పెరిగింది. ఘాటైన ఆహారం, డ్రైఫ్రూట్స్ తింటే వైరస్ ప్రభావం అంతగా చూపదని కొందరు... రోజూ కషాయం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మరికొందరు ఆహారంలో వాటి వినియోగాన్ని పెంచారు. మార్కెట్లో వీటికి భారీ గిరాకీ ఏర్పడింది. శొంఠి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్కలను ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. వీటికితోడు గసాలా, జాజికాయ, జాపత్రి, మరాఠి మొగ్గలను ఎక్కువగా కొంటున్నారు.
ధరలు పెరిగాయి
మూడు నెలల కిందటి ధరతో పోల్చితే కొన్ని దినుసుల ధరలు పెరిగాయి. దిగువ మధ్యతరగతి వారు ఎక్కువగా శొంఠి, మిరియాలు తీసుకుంటున్నారని లక్డీకాపూల్‌లో టోకు, చిల్లర దుకాణాన్ని నిర్వహిస్తున్న ఒక వ్యాపారి తెలిపారు. రెండు నెలల వ్యవధిలో దినుసుల అమ్మకాలు భారీగా పెరిగాయని అన్నారు. కషాయంలో వినియోగించే తాటి బెల్లాన్ని చాలామంది కొంటున్నారు. సాధారణ బెల్లాన్ని కూడా కొందరు వినియోగిస్తున్నారు.
తగ్గిన ఎండుఫలాల నిల్వలు
కరోనా వ్యాప్తితో డ్రైవర్లు, క్లీనర్లు అందుబాటులో లేక సరుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశం దిగుమతి కావల్సిన మసాలా దినుసులు, ఎండు ఫలాలు తగినంత రావడం లేదని పేర్కొంటున్నారు. అక్రూట్, అంజీరా, పిస్తా నిల్వలు తగ్గిపోయాయని, డబ్బులు చెల్లిస్తున్నా రవాణా సౌకర్యాల కొరతతో ముంబయి మార్గంలో దిగుమతులు నిలిచిపోయి వాటి ధరలూ పెరుగుతున్నట్లు కొందరు వ్యాపారులు తెలిపారు.