ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వంశీకృష్ణ, ప్రవళిక మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమకు చిహ్నంగా అతను ఛాతిపై ఆమె చిత్రాన్ని ముద్రించుకున్నాడు. కొన్ని రోజులపాటు వీరి ప్రేమ సజావుగానే సాగినప్పటికీ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వంశీకృష్ణ మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
చిలకలగూడలో నివాసం ఉంటున్న వంశీకృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్వాల్‌కు చెందిన ప్రవళిక అనే యువతి సికింద్రాబాదులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారింది. వారివురి మధ్య ఇటీవల పలు విషయాల్లో మనస్పర్థలు రావడంతో గొడవలు జరిగినట్లు వంశీకృష్ణ స్నేహితులు తెలిపారు. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని ప్రవళిక చెప్పడంతో అతను మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు.
విధులకు వెళ్తున్నానని చెప్పి..
మనస్తాపం చెందిన వంశీకృష్ణ.. స్నేహితులతో గడిపిన అనంతరం విధులకు వెళ్తున్నానని చెప్పి భూదేవి నగర్‌లోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వంశీకృష్ణ ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమా లేక మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: