తెలంగాణలోని కరీంనగర్ కాకతీయ కాలువలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు దంపతులు కాలువలో పడిన ఘటన మరువక ముందే... మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చిన్న సోదరి కుటుంబంగా గుర్తించారు. లక్ష్మీపూర్‌కు చెందిన సత్యనారాయణరెడ్డి, రాధ, వారి కుమార్తె వినయశ్రీగా పోలీసులు నిర్ధరించారు.
అసలేం జరిగిందంటే?
ఆదివారం గన్నేరువరానికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంతో అదుపుతప్పి కాలువలోపడిపోయారు. అప్పుడే దారి గుండా వస్తున్న బ్లూ కోట్ పోలీసులు గమనించి ప్రదీప్‌ను గట్టుకు చేర్చగా... అతని భార్య ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కెనాల్లో మృతదేహం కోసం గాలింపు చర్యల్లో భాగంగా నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఇదే సమయంలో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లి శివారులోని కాకతీయ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. క్రేన్ సాయంతో కారును పైకి తీయగా కుళ్లిన శవాలు లభ్యమయ్యాయి.
ఈ మృతదేహాలు పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిన్న సోదరి కుటుంబానివిగా గుర్తించారు. నారెడ్డి సత్యనారాయణరెడ్డి, రాధ దంపతులు, వీరి కుమార్తె వినయశ్రీగా పోలీసులు తేల్చారు. వీరి స్వగ్రామం కరీంనగర్ సమీపంలోని లక్ష్మీపురం ప్రస్తుతం కరీంనగర్‌లోనే ఉంటున్నారు. 20రోజుల కిందటే కారు కాలువలో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.