రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఆరేళ్ల వయసు గల ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ బాలుడు (14), చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ కామాంధుడు (28) ఈ దారుణానికి ఒడిగట్టారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో మేనమామ ఇంటికి విశాఖ జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన ఓ బాలుడు (14) వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఓ బాలికను (6) ఇంటిపక్కన డాబాపై ఆరేసిన దుస్తులు తీసుకొద్దామని చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆ బాలిక వేసిన కేకలు విని మిగతా పిల్లలు రావడంతో అతను పారిపోయాడు. బాలికను వైద్యం నిమిత్తం ఏలేశ్వరం సీహెచ్‌సీకి తరలించారు.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన మహేష్ (28) ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి నిద్రపోయే సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గుర్తించి వారు ఆరా తీశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఏమిటీ పశువాంఛ: పవన్ కల్యాణ్
‘అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారమేమిటి? ఏమిటీ పశువాంఛ? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘటనలో ఆ చిన్నారి పరిస్థితి ఊహించుకుంటే గుండెలు బరువెక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఈ మధ్య కాలంలో ఏపీలో ఆడపిల్లలపై వరుసగా అకృత్యాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో 584 అత్యాచారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఎందుకు దాడులు జరుగుతున్నాయి అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: