తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబ్బతి ప్రభాకర్, పబ్బతి సరిత భార్యాభర్తలు. ఇద్దరూ కూడబలుక్కుని బ్యాంకు మోసాలకు తెరతీశారు. పలు బ్యాంకులను ఇంటి స్థలాలు, ఇండ్ల రుణాల పేరిట మోసం చేశారు. నకిలీ పత్రాలతో లక్షల్లో రుణాలు పొంది.. వాయిదాలు కట్టకుండా…చిరునామాలో లేకుండా చెక్కేసేవారు. కొంతమంది రియల్ వ్యాపారులను సైతం తమ తెలివితేటలతో సునాయాసంగా బోల్తా కొట్టించారు.
ఒక్క షాద్ నగర్ ఇండియన్ బ్యాంకు లోనే రూ.5కోట్ల 30లక్షలు రుణం తీసుకున్న ఈ దంపతులు చేసిన బ్యాంకు మోసాల విలువ సుమారు 25కోట్ల రూపాయల వరకు తేలింది. రుణాలు తీసుకున్న వీరు వాయిదాలు కట్టక పోవడం,ఇచ్చిన అడ్రెస్ లో లేకపోవడంతో పత్రాలు తిరగేస్తే అవి నకిలీవని తేలింది. దీంతో షాద్ నగర్ ఇండియన్ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు వారిద్దరిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.