Police Searches at Vallabhaneni Vamsi House: వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు రాయదుర్గంలోని వంశీ నివాసంలో సోదాలు చేశారు. ఇందుకోసం ఏపీ నుంచి హైదరాబాద్‌కు రెండు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. చివరగా వంశీ ఇంట్లోనే సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ చూపించింది.
అయితే వల్లభనేని వంశీ ఇంట్లో విస్తృతంగా గాలించినా ఫోన్ లభించకపోవడంతో ఏపీ పోలీసులు వెనుదిరిగారు. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వంశీ సెల్‌ఫోన్ కోసం విజయవాడ కోర్టులో ఇప్పటికే పోలీసుల పిటిషన్ వేశారు. కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్‌లోనూ వంశీ సెల్‌ఫోన్ అంశం ప్రస్తావించారు. అదే విధంగా ఇతర నిందితుల గాలింపులో వంశీ సెల్‌ఫోన్ కీలకం కానుంది. పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలిస్తోంది.
పరారీలో ఉన్న నిందితులను గాలించేందుకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రెండు బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. ఈ కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారుతుంది. ఫోన్ ద్వారా ఎవరెవరితో మాట్లాడారు. ఎక్కడెక్కడ వంశీ తిరిగాడు అనే విషయాలు తెలుస్తాయి. వంశీ అధికంగా వాట్సప్ ద్వారా ఫోన్లు మాట్లాడేవారని పోలీసులు భావిస్తున్నారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సమయంలో ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు. ఫోన్‌ను సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కస్టడీ పిటిషన్‌లోనూ కోరారు. ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు పంపిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు పిటిషన్లో తెలిపారు.
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని వంశీ ఇంటిని తనిఖీ చేస్తే ఫోన్ దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస‌్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. వంశీతో సహా మొత్తం ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వంశీ ప్రధాన అనుచరుడు కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఈ కేసులో ఏ2 గా ఉన్నాడు. కోట్లు ద్వారానే వంశీ, సత్యవర్ధన్‌ను కలిసినట్లు సమాచారం. కోట్లుని అదుపులోకి తీసుకుంటే ఈ కేసులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.