Vladimir Putin News: ఉక్రెయిన్ సంక్షోభం వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయనకు క్యాన్సర్ చికిత్స జరగవచ్చని, దాంతో తాత్కాలికంగా తన అధికారాన్ని మరొకరికి కట్టబెట్టనున్నారని తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ పట్రుషెవ్‌కు తన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోందని.. అమెరికాకు చెందిన ఓ వార్తా సంస్థ దీనిపై కథనాన్ని రాసుకొచ్చింది. అయితే దీనికి అధికారిక ధ్రువీకరణ మాత్రం లేదు.
పుతిన్ రూపం అసాధారణంగా కనిపిస్తోందని, ఆయన పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నారంటూ ఇటీవల కాలంలో పలు ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇవేకాకుండా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని వదంతులు వినిపిస్తున్నాయని ఆ కథనం పేర్కొంది. కాగా, కొద్ది రోజుల క్రితం పట్రుషెవ్‌తో పుతిన్ రెండు గంటల పాటు సంభాషించారని వెల్లడించింది. రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ నిర్వహిస్తున్నట్లు భావిస్తోన్న ఓ మీడియా సంస్థ పెట్టిన పోస్టును ఇక్కడ ప్రస్తావించింది. 'పట్రుషెవ్‌ను తన ఏకైక విశ్వసనీయ మిత్రుడిగా భావిస్తున్నట్లు పుతిన్ సంకేతాలిచ్చారని మాకు తెలుసు. తన ఆరోగ్యం మరింత దిగజారితే.. దేశ నిర్వహణ తాత్కాలికంగా పట్రుషేవ్ చేతుల్లోకి వెళ్తుందని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ఆ విశ్వసనీయ వ్యక్తి క్రూరుడు. అతడు పుతిన్ కంటే మెరుగేమీ కాదు. అతడొక జిత్తులమారి. అతడు అధికారంలోకి వస్తే రష్యా సమస్యలు మరింత పెరుగుతాయి. అయితే ఎక్కువరోజులు అధికారానికి దూరంగా ఉండటానికి పుతిన్ అంగీకరించకపోవచ్చు. ఆ సమయం రెండుమూడు రోజులు మించకపోవచ్చు' అంటూ ఆ పోస్టును ఉటంకిస్తూ.. ఆ కథనం రాసుకొచ్చింది. పుతిన్ అనారోగ్యంపై వస్తోన్న వార్తలను పెంటాగన్ ధ్రువీకరించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. నికొలాయ్ పట్రుషెవ్ సెక్రటరీగా ఉన్న సెక్యూరిటీ కౌన్సిల్ అత్యంత శక్తివంతమైనది. ఆ సంస్థ పుతిన్‌కు నేరుగా వివరాలు వెల్లడిస్తుంది. అలాగే ఆ దేశంలో సైనిక, భద్రతాపర అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తుంది. పుతిన్ వలే నికొలాయ్ కూడా రష్యా ఇంటిలిజెన్స్ ఏజెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అధ్యక్షుడికి సన్నిహితుడిగా అందరికి సుపరిచితుడు. అతడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, దాని మిత్ర దేశాలపై తీవ్ర విమర్శలు చేశారు. కీవ్‌లోని తమ అనుచరులను ఉపయోగించుకొని అమెరికన్లు రష్యాను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనానికి 'మాస్కో' స్కెచ్!