Same sex marriage US: స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించేలా అమెరికా దిగువ సభ బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ ఇటీవల అక్కడి సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ బిల్లును తీసుకొచ్చారు అక్కడి చట్టసభ్యులు. ఈ సందర్భంగా సభలో వాడీవేడి చర్చ జరిగింది. గే వివాహాలకు డెమొక్రాట్లు మద్దతు పలకగా.. కొంతమంది రిపబ్లికన్లు మాత్రం ఈ అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించాలని పలువురు రిపబ్లికన్ చట్టసభ్యులు హితవు పలికారు. బిల్లును ప్రవేశపెట్టడం అనవసరమైన చర్యగా పేర్కొన్నారు. అయితే, 47 మంది రిపబ్లికన్లు బిల్లుకు మద్దతిచ్చారు. దీంతో ఈ బిల్లు 267-157 ఓట్ల తేడాతో సభ ఆమోదం పొందింది.
ఈ ఏడాది మధ్యంతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సభ్యులు సైతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిల్లుకు మద్దతు పలికినట్లు సమాచారం. అయితే, బిల్లుకు సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది. 100 సీట్లు ఉన్న పెద్దల సభలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు చెరో యాభై స్థానాలు ఉన్నాయి. ఎక్కువ మంది రిపబ్లికన్లు ఈ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
కాగా, సాధారణ పౌరుల్లో స్వలింగ సంపర్కుల వివాహాల పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. జూన్లో నిర్వహించిన ఓ పోల్లో.. 70 శాతం మంది అమెరికా వయోజనులు.. గే వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుకున్నారు. డెమొక్రాట్లలో 83 శాతం మంది, రిపబ్లికన్లలో 55శాతం మంది సేమ్ సెక్స్ వివాహాలకు మద్దతు పలికారు.
ఇదీ చదవండి: