Green Card Applications : గ్రీన్‌కార్డు దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెసింగ్ చేయాలని, ఇప్పటివరకు ఉన్న మొత్తం పెండింగు దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్‌లోగా పరిష్కరించాలని అమెరికా ప్రెసిడెన్షియల్ కమిషన్ నుంచి వచ్చిన సూచనలను శ్వేతసౌధం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే వేలకొద్దీ వలస కుటుంబాలు.. ముఖ్యంగా భారత్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చినవారికి అపార ప్రయోజనం ఉంటుంది. ఏషియన్ అమెరికన్లు, నేటివ్ హవాయియన్లు, పసిఫిక్ ఐలాండర్ల విషయంలో అధ్యక్షుడి సలహా మండలి ఈ సంవత్సరం మే నెలలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. మే 12న ఆమోదించి, అధ్యక్షుడికి ఆగస్టు 24న పంపిన ప్రతిపాదనల వివరాలను తాజాగా ఈ కమిషన్ విడుదల చేసింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పంపేముందు శ్వేతసౌధంలోని డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తోంది. పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ లేదా గ్రీన్‌కార్డ్ ఉంటే అమెరికాకు వలస వచ్చినవారికి అక్కడే శాశ్వతంగా నివాసం ఉండే అవకాశం లభిస్తుంది. సిలికాన్ వ్యాలీలోని భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుటోరియా ఆదినుంచి జో బైడెన్‌కు గట్టి మద్దతుదారుగా ఉంటున్నారు. తమ వర్గం నుంచి వచ్చిన సూచనలతో ఆయన కమిషన్ తొలి సమావేశంలోనే ఈ ప్రతిపాదన పెట్టారు. దాన్ని కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కొవిడ్-19 కారణంగా గత కొన్నాళ్లుగా గ్రీన్‌కార్డుల ప్రాసెసింగ్‌లో అవాంతరాలు ఏర్పడ్డాయి. మొత్తం 2.26 లక్షల గ్రీన్‌కార్డులు అందుబాటులో ఉన్నా, కేవలం 65,452 కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులనే 2021 ఆర్థిక సంవత్సరంలో జారీచేశారు. 2022 ఆగస్టు నుంచి గ్రీన్‌కార్డు దరఖాస్తుల ఇంటర్వ్యూలు చేయడానికి నేషనల్ వీసా సెంటర్ (ఎన్‌వీసీ) అధికారులను మరింతగా నియమించుకోవాలని కమిషన్ సూచించింది. వీసా ఇంటర్వ్యూలు, గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని 150 శాతం పెంచుకుని, ప్రస్తుతమున్న పెండింగ్ దరఖాస్తులను 2023 చివరికల్లా పూర్తిచేయాలని తెలిపింది.
ఇదీ చదవండి: చైనాలో సైనిక తిరుగుబాటు.. గృహ నిర్బంధంలో జిన్‌పింగ్!