అమెరికాలోని మాంటెరీ పార్క్ కాల్పుల నిందితుడు హతమయ్యాడు. చైనీయుల లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న మాంటెరీ పార్క్‌లో మెషీన్ గన్‌తో వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పది మందిని బలి తీసుకున్న 72 ఏళ్ల హు కన్ ట్రాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తెల్ల రంగు వ్యాన్‌లో వచ్చిన వ్యక్తే... ఈ మారణ హోమానికి కారణమని నిర్ధరించిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. వ్యాన్‌ను పోలీసులు చుట్టుముట్టడంతో హు కన్ ట్రాన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. రెండోసారి ట్రాన్ కాల్పులకు సిద్ధమవుతుండగా స్థానికులు అడ్డుకున్నారని వెంటనే నిందితుడు వ్యాన్‌లో పారిపోయాడని తెలిపారు. ట్రాన్ ఈ దాడికి పాల్పడటానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనలో ఇంకా అనుమానితులు ఎవరూ లేరని తెలిపారు.
దుర్ఘటన జరిగిన 34 కిలోమీటర్ల దూరంలో నిందితుడి వ్యాన్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆసియన్లు ఎక్కువగా నివసించే టోరెన్స్‌లో వ్యాన్ కనుగొనడం తొలుత తీవ్ర భయాందోళనలను కలిగించింది. ఇటు నిందితుడు ట్రాన్ ఆత్మహత్య చేసుకున్నా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి మానసిక వ్యాధి ఉందా, గతంలో ఏమైనా హింసకు పాల్పడ్డాడా, గన్‌లను చట్టపరంగానే పొందాడా, అక్రమ మార్గంలో వస్తే ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలోదర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కాల్పులు జరుపుతున్నప్పుడు ఆలస్యంగా స్పందించారన్న విమర్శలను పోలీసులు ఖండించారు. ఫోన్ వచ్చిన మూడు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని మాంటెరీ పార్క్ పోలీస్ చీఫ్ స్కాట్ వైస్ తెలిపారు.
అమెరికాలో ఈ నెలలోనే అయిదోసారి కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలు వేడుకల్లో పాల్గొనాలంటేనే భయపడే పరిస్థితులు వస్తున్నాయి. గత ఏడాది మే 24న టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో 21 మంది మరణించిన తర్వాత ఇది అత్యంత ఘోరమైన దాడి. మాంటెరీ పార్క్‌లోని వేడుక కాలిఫోర్నియాలో అతిపెద్దది. కాల్పుల ఘటనతో ఇవాళ జరగాల్సిన చైనా నూతన లూనార్ సంవత్సర వేడుకలను రద్దు చేశారు.